14. పదునాల్గవ అధ్యాయము

ఇంద్రాణి ఇంద్రుని కలసికొనుట.

శల్య ఉవాచ
అథైనం రూపిణీ సాధ్వీమ్ ఉపాతిష్ఠదుపశ్రుతిః।
తాం వయోరూపసంపన్నాం దృష్ట్వా దేవీముపస్థితామ్॥ 1
ఇంద్రాణీ సంప్రహృష్టాత్మా సంపూజ్యైనామథాబ్రవీత్।
ఇచ్ఛామి త్వామహం జ్ఞాతుం కా త్వం బ్రూహి వరాననే॥ 2
శల్యుడు పలికాడు. యుధిష్ఠిరా! అప్పుడు ఉపశ్రుతి శచీదేవికి ప్రత్యక్షమైంది. యౌవనంతో, చక్కని రూపంతో ప్రకాశిస్తున్న అమ్మవారిని చూచి ఇంద్రాణి ఆనందంతో ఆమెను పూజించి "సుముఖీ! నీవు ఎవరో తెలుసుకోవాలనుకొంటున్నాను. ఎవరు నీవు? చెప్పు" అని అడిగింది. (2)
ఉపశ్రుతిరువాచ
ఉపశ్రుతిరహం దేవి తవాంతికముపాగతా।
దర్శనం చైవ సంప్రాప్తా తవ సత్యేన భావిని॥ 3
ఉపశ్రుతి పలికింది. సద్భావం కల దేవీ! నీ దగ్గరకు వచ్చిన నేను ఉపశ్రుతిని. నీ సత్యనిష్ఠతో నా దర్శనం నీకు లభించింది. (3)
పతివ్రతా చ యుక్తా చ యమేన నియమేన చ&/
దర్శయిష్యామి తే శక్రం దేవం వృత్రనిషూదనమ్॥ 4
నీవు పతివ్రతవు. యమ నియమాలతో కూడి ఉన్నావు. కనుక వృత్రాసురున్ చంపిన దేవేంద్రుని నీకు చూపిస్తాను. (4)
క్షిప్రన్వేహి భద్రం తే ద్రక్ష్యసే సురసత్తమమ్।
తతస్తాం ప్రహితాం దేవీమ్ ఇంద్రాణీ సా సమన్వగాత్॥ 5
నీకు శుభమగుగాక! నీవు త్వరగా నాతో రా "నీకు దేవేంద్రుని దర్శనం అవుతుంది." అని పలికి బయలు దేరిన ఉపశ్రుతి వెనుక ఇంద్రాణి వెళ్లింది. (5)
దేవారణ్యాన్యతిక్రమ్య పర్వతాంశ్చ బహూంస్తతః।
హిమవంతమతిక్రమ్య ఉత్తరం పార్శ్వమాగమత్॥ 6
సముద్రం చ సమాసాద్య బహుయోజనవిస్తృతమ్।
ఆససాద మహాద్వీపం నానాద్రుమలతావృతమ్॥ 7
అనేక దేవారణ్యాలను, పర్వతాలను దాటివచ్చి హిమాలయ పర్వతాన్ని దాటి, ఉపశ్రుతి ఆ పర్వతం ఉత్తరంవైపుకు నడిచింది. తరువాత ఎన్నో యోజనాల దూరం వ్యాపించిన సముద్రాన్ని చేరుకొని మధ్యలో పలురకాల చెట్లు, తీగెలతో నిండిన ఒక పెద్దదీవిలో అడుగుపెట్టింది. (6,7)
తత్రాపశ్యత్ సరో దివ్యం నానాశకునిభిర్వృతమ్।
శతయోజనవిస్తీర్ణం తావదేవాయతం శుభమ్॥ 8
ఆ దీవిలో నూరుయోజనాల విస్తీర్ణం, అంతే లోతు కలిగి పలురకాల పక్షులతో నిండిన మంగళకరమైన దివ్యసరస్సును చూచింది. (8)
తత్ర దివ్యాని పద్మాని పంచవర్ణాని భారత।
షట్పదైరుపగీతాని ప్రఫుల్లాని సహస్రశః॥ 9
ధర్మరాజా! ఆ సరస్సులో చక్కగా వికసించి తుమ్మెదల గానంతో దివ్యకాంతితో నిండిన అయిదు రంగుల తామరపూలు వేలసంఖ్యలో ఉన్నాయి. (9)
సరసస్తస్య మధ్యే తు పద్మినీ మహతీ శుభాం।
గౌరేణోన్నతనాలేన పద్మేన మహతా వృతా॥ 10
ఆ సరస్సు మధ్యలో ఒక సుందరమైన పెద్ద కమలం రంగు, పొడవు, వైశాల్యం గల కాడతో కనిపిస్తోంది. (10)
పద్మస్య భిత్త్వా నాలం చ వివేశ సహితా తయా।
బిసతంతుప్రవిష్టం చ తత్రాపశ్యచ్ఛతక్రతుమ్॥ 11
ఉపశ్రుతిదేవి ఆ పద్మనాళాన్ని చీల్చి, శచీదేవితో సహా దానిలోపలికి వెళ్లింది. అక్కడ తామర తూడులో దాగి ఉన్న ఇంద్రుణ్ణి చూచింది. (11)
తం దృష్ట్వాచ సుసూక్ష్మేణ రూపేణావస్థితం ప్రభుమ్।
సూక్ష్మరూపధరా దేవీ బభూవోపశ్రుతిశ్చ సా॥ 11
మిక్కిలి సూక్ష్మరూపంలో ఉన్న ప్రభువైన ఇంద్రుని చూచి, ఉపశ్రుతి, ఇంద్రాణి కూడా సూక్ష్మరూపాన్ని ధరించారు. (12)
ఇంద్రం తుష్టాన చేంద్రాణీ విశ్రుతైః పూర్వకర్మభిః।
స్తూయమానస్తతో దేవః శచీమాహ పురందరః॥ 12
పూర్వం ఇంద్రుడు చేసిన గొప్పపనులను గుర్తుచేస్తూ శచీదేవి ఇంద్రుని స్తుతించింది. ఆ స్తోత్రాలు విని పురందరుడు ఆమెతో ఇలా అన్నాడు. (13)
కిమర్థమసి సంప్రాప్తా విజ్ఞాతశ్చ కథం త్వహమ్।
తతః సా కథయామాస నహుషస్య విచేష్టితమ్॥ 14
'దేవీ! నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ ఉన్నట్లు నీ కెలా తెలిసింది?' అని అడిగాడు. ఇంద్రాణి నహుషుని దుష్ప్రవర్తనను వివరించి చెప్పింది. (14)
ఇంద్రత్వం త్రిషు లోకేషు ప్రాప్య వీర్యసమన్వితః।
దర్పావిష్టశ్చ దుష్టాత్మా మామువాచ శతక్రతో॥ 15
ఉపతిష్ఠేతి స క్రూరః కాలం చ కృతవాన్ మమ।
యది న త్రాస్యసి విభో కరిష్యతి స మాం వశే॥ 16
'శతక్రతూ! ముల్లోకాల ఆధిపత్యమైన ఇంద్రత్వాన్ని పొంది, మహాబలుడై' గర్వంతో నిండి, దుష్టబుద్ధి అయిన నహుషుడు తనతో ఉండమంటున్నాడు. దానికి గడువుకూడా పెట్టాడు. ప్రభూ! నీవు నన్ను రక్షించకపోతే వాడు నన్ను స్వాధీనం చేసుకుంటాడు. (15,16)
ఏతేన చాహం సంప్రాప్తా ద్రుతం శక్ర తవాంతికమ్।
జహి రౌద్రం మహాబాహో నహుషం పాపనిశ్చయమ్॥ 17
మహాబాహూ! శక్రా! ఆ కారణంగా నీ దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాను. భయంకరుడు, పాపబుద్ధి అయిన నహుషుని సంహరించు. (17)
ప్రకాశయాత్మనాఽఽత్మానం దైత్యదానవసూదన।
తేజః సమాప్నుహి విభో దేవరాజ్యం ప్రశాధి చ॥ 18
దైత్యదానవసూదనా! ప్రభో! నీవే వెలుపలికి రా! తేజస్సును పొందు. దేవరాజ్యాన్ని పరిపాలించు అంది. (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి ఇంద్రాణీంద్రస్తనే చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున ఇంద్రాణీంద్రస్తవమను పదునాల్గవ అధ్యాయము. (14)