55. ఏబది అయిదవ అధ్యాయము
దుర్యోధనుడు తన శక్తిని గూర్చి చెప్పుకొనుట.
దుర్యోధన ఉవాచ
న భేతవ్యం మహారాజ న శోచ్యా భవతా వయమ్।
సమర్థాః స్మ పరాన్ జేతుం బలినః సమరే విభో॥ 1
దుర్యోధనుడు ఇలా అన్నాడు. మహారాజా! భయపడవలసిన పనిలేదు. మమ్మల్ని గూర్చి మీరు విచారించవద్దు. మేము శత్రువులను జయింపగలము. రాజా! మేము యుద్ధంలో బలవంతులమే. (1)
వనే ప్రవ్రాజితాన్ పార్థాన్ యదాఽఽయా న్మధుసూదనః।
మహతా బలచక్రేణ పరరాష్ట్రావమర్దినా॥ 2
వనవాసానికి పోయిన పాండవులను తీసికొని ఇతర రాష్ట్రాలను ఇబ్బందిపెట్టే పెద్దసేనతో కృష్ణుడు వచ్చాడు. (2)
కేకయా ధృష్టకేతుశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః।
రాజానశ్చాన్వయుః పార్థాన్ బహవోఽన్యేఽనుయాయినః॥ 3
కేకయరాజులు, ధృష్టకేతుడు, ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు - ఇంకా ఇతర రాజులూ ఆ పాండవులను అనుసరించారు. (3)
ఇంద్రప్రస్థస్య చాదూరాత్ సమాజగ్ముర్మహారథాః।
వ్యగర్హయంశ్చ సంగమ్య భవంతం కురుభిః సహ॥ 4
ఆ మహారథులంతా ఇంద్ర ప్రస్థానికి దగ్గరగా వచ్చి కలిసి, నిన్నూ కౌరవులనూ కూడా నిందించాడు. (4)
తే యుధిష్ఠిర మాసీనమ్ అజినైః ప్రతివాసితమ్।
కృష్ణప్రధానాః సంహత్య పర్యుపాసంత భారత॥ 5
నార బట్టలు కట్టుకొని కూర్చున్న ధర్మరాజును కృష్ణుడు మొదలయిన వారంతా సేవించారు. (5)
ప్రత్యాదానం చ రాజ్యస్య కార్యమూచుర్నరాధిపాః।
భవతః సానుబంధస్య సముచ్ఛేదం చికీర్షవః॥ 6
రాజ్యం తిరిగి పొందడాన్ని గురించి, నిన్ను బంధువులతో సహా పెకలించి వేయటానికి ఆరాజులు కర్తవ్యం బోధ చేశారు. (6)
శ్రుత్వా చైవం మయోక్తాస్తు భీష్మద్రోణ కృపా స్తదా।
జ్ఞాతిక్షయభయాద్రాజన్ భీతేన భరతర్షభ॥ 7
ఇదంతా నేను విని, బంధునాశాన్ని, భయాన్ని దృష్టిలో పెట్టుకొని భీష్మద్రోణ కృపులతో ఇలా అన్నాను. (7)
తతః స్థాస్యంతి సమయే పాండవా ఇతి మే మతిః।
సముచ్ఛేదం హి నః కృత్స్నం వాసుదేవః చికీర్షతి॥ 8
పాండవులు మాటమీద నిలుస్తారని నా అభిప్రాయం. కాని ఆ కృష్ణుడు మాత్రం మనల నందరినీ పెల్లగించివేయాలనుకొంటున్నాడు. (8)
ఋతే చ విదురాత్ సర్వే యూయం వధ్యా మతా మమ।
ధృతరాష్ట్రస్తు ధర్మజ్ఞః న వధ్యః కురుసత్తమః॥ 9
విదురుడు తప్ప మిగిలిన మీరంతా చంపదహిన వారే. (కృష్ణుని అభిప్రాయం).ధృతరాష్ట్రుడు మాత్రం కురూత్తముడు ధర్మజ్ఞుడు. అవధ్యుడు. (9)
సముచ్ఛేదం చ కృత్స్నం నః కృత్వా తాత జనార్దనః।
ఏకరాజ్యం కురూణాం స్మ చికీర్షతి యుధిష్ఠిరే॥ 10
మనల నందరినీ పూర్తిగా చంపి ఈ కౌరవుల ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ఆ ధర్మరాజుకు కట్టబెట్టాలని కృష్ణుడనుకొంటున్నాడు. (10)
తత్ర కిం ప్రాప్తకాలం నః ప్రణిపాతం పలాయనమ్।
ప్రాణాన్ వా సంపరిత్యజ్య ప్రతియుద్ధ్యామహే పరాన్॥ 11
ఇపుడు మన కర్తవ్యం ఏమిటి? కాళ్లమీద పడటమా? పలాయనం చిత్తగించడమా? లేక ప్రాణాలకు తెగించి శత్రువులతో యుద్ధం చేయడమా? (11)
ప్రతియుద్ధే తు నియతః స్యాదస్మాకం పరాజయః।
యుధిష్ఠిరస్య సర్వే హి పార్థివా వశవర్తినః॥ 12
యుద్ధం చేస్తే మనకు పరాజయం తప్పదు. రాజులంతా ధర్మరాజుకు వశమయి ప్రవర్తిస్తున్నారు గదా! (12)
విరక్తరాష్ట్రాశ్చ వయం మిత్రాణి కుపితాని నః।
ధిక్కృతాః పార్థివైః సర్వైః స్వజనేన చ సర్వశః॥ 13
రాష్ట్రాలకు మనమీద విరక్తి కలిగింది. మిత్రులు కూడా మన మీద కోపించారు. మిగిలిన రాజులూ, మనవారూ కూడా అన్ని విధాలా మనల్ని ధిక్కరిస్తున్నారు. (13)
ప్రణిపాతే న దోషోఽస్తి సంధిర్నః శాశ్వతీః సమాః।
పితరం త్వేవ శోచామి ప్రజ్ఞానేత్రం జనాధిపమ్॥ 14
కాళ్లమీద పడటం వల్ల తప్పులేదు. పైగా సంధి శాశ్వతంగా ఉంటుంది. కాని ప్రజ్ఞయే కనులుగా గల మా మహారాజు, తండ్రిని గురించి విచారిస్తున్నాను. (14)
మత్కృతే దుఃఖమాపన్నం క్లేశం ప్రాప్తమనంతకమ్।
కృతం హి తవ పుత్రైశ్చ పరేషా మవరోధనమ్।
మత్ప్రియార్థం పురైవేతద్ విదితం తే నరోత్తమ॥ 15
నాకోసం మాతండ్రి చాలా బాధపడుతున్నాడు. అంతులేని కష్టం పొందాడు. రాజా! నీ పుత్రులు కూడా శత్రువులను అడ్డగించారు. ఇదంతా పూర్వం నాకోసం జరిగింది. ఇది నీకు తెలుసును. (15)
తే రాజ్ఞో ధృతరాష్ట్రస్య సామాత్యస్య మహారథాః।
వైరం ప్రతికరిష్యంతి కులోచ్ఛేదేన పాండవాః॥ 16
అందుచేత మహారథులైన ఆ రాజులూ, పాండవులూ, మంత్రి సహితమైన ధృతరాష్ట్ర మహారాజు యొక్క వంశాన్ని సమూలంగా నాశనం చేసి ప్రతీకారం తీర్చుకొంటారు. (16)
తతో ద్రోణోఽబ్రవీద్ భీష్మః కృపో ద్రౌణిశ్చ భారత।
మత్వా మాం మహతీం చింతామ్ ఆస్థితం వ్యధితేంద్రియమ్॥ 17
ఇలా అనగానే ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, 'నాకు పెద్ద వ్యథ ఏర్పడిందని, నా మనసు బాధపడుతోం'దని అనుకొని ఇలా అన్నారు. (17)
అభిద్రుగ్ధాః పరే చేన్నః న భేతవ్యం పరంతప।
అసమర్థాః పరే జేతుం అస్మాన్యుధి సమాస్థితాన్॥ 18
శత్రుంజయా! శత్రువులకు మనం ద్రోహం చేసినా సరే నీవు భయపడ నవసరం లేదు. రణరంగంలో నిలిస్తే మనలను పరులు జయించలేరు. (18)
ఏకైకశః సమర్థాః స్మః విజేతుం సర్వపార్థివాన్।
ఆగచ్ఛంతు వినేష్యామః దర్పమేషాం శితైః శరైః॥ 19
మనం ఒక్కొక్కరమూ రాజులందరినీ జయించగలము. రానియ్యి. వాడి బాణాలతో వారి గర్వం అణుచుదాం. (19)
పురైకేన హి భీష్మేణ విజితాః సర్వపార్థివాః।
మృతే పితర్యతిక్రుద్ధః రథేనైకేన భారత॥ 20
తండ్రి చనిపోయినపుడు రాజులందరూ దండెత్తితే భీష్ముడొక్కడే కేవలం రథమాత్ర సహాయుడై రాజులందరినీ జయించాడు. (20)
జఘాన సుబహూంస్తేషాం సంరబ్ధః కురుసత్తమః।
తతస్తే శరణం జగ్ముః దేవవ్రతమిమం భయాత్॥ 21
కురుసత్తముడైన భీష్ముడు కోపంతో వారిలో చాలా మందిని సంహరించాడు. మిగిలినవారు భయంతో భీష్ముని శరణు కోరారు. (21)
స భీష్మః సుసమర్థోఽయమ్ అస్మాభిః సహితో రణే।
పరాన్ విజేతుం తస్మాత్తే వ్యేతు భీర్భరతర్షభ॥ 22
దుర్యోధనా! చక్కని సమర్థుడయిన భీష్ముడు యుద్ధంలో మన ప్రక్కనుంటాడు. శత్రువులను జయిస్తాడు. అందుచేత నీ భయం పోవుగాక. (22)
ఇత్యేషాం నిశ్చయోహ్యాసీత్ తత్కాలేఽమిత తేజసామ్।
పురా పరేషాం పృథివీ కృత్స్నాఽసీద్ వశవర్తినీ॥ 23
ఇలా ఈ మహాతేజస్వులంతా అపుడు నిశ్చయించారు. శత్రువుల భూమి అంతా ఎపుడో పూర్వమే మన వశమయింది. (23)
అస్మాన్ పునరమీ నాద్య సమర్థా జేతుమాహవే।
భిన్నపక్షాః పరే హ్యద్య వీర్యహీనాశ్చ పాండవాః॥ 24
రెక్కలు తెగి శక్తి లేని పాండవులు ఇపుడు మనలను యుద్ధంలో జయింప సమర్థులు కారు. (24)
అస్మత్సంస్థా చ పృథివీ వర్తతే భారతర్షభ।
ఏకార్థాః సుఖదుఃఖేషు సమానీతాశ్చ పార్థివాః॥ 25
భూమి అంతా మన వశమయి ఉంది. సుఖదుఃఖాల్లో సమానంగా పాలుపంచుకొనే మిత్రరాజులంతా ఇక్కడకు రానే వచ్చారు. (25)
అప్యగ్నిం ప్రవిశేయుస్తే సముద్రం వా పరంతప।
మదర్థం పార్థివాః సర్వే తద్విద్ధి కురుసత్తమ॥ 26
నా కోసం ఈ రాజులంతా అగ్నిలోనయినా, సముద్రం లోనయినా దూకుతారు. మహారాజా! ఇది తెలుసుకో. (26)
ఉన్మత్తమివ చాపి త్వాం ప్రహసంతీహ దుఃఖితమ్।
విలపంతం బహువిధం భీతం పరవికత్థనే॥ 27
శత్రుగుణాలను పొగడుతూ, భయపడుతూ, ఏడుస్తూ పిచ్చివానిలా మాట్లాడుతున్న నిన్ను చూసి ఇక్కడ నవ్వుతున్నారు. (27)
ఏషాం హ్యేకైకశో రాజ్ఞాం సమర్థః పాండవాన్ ప్రతి।
ఆత్మానం మన్యతే సర్వః వ్యేతు తే భయమాగతమ్॥ 28
ఈ వచ్చిన రాజులందరూ తానొక్కక్కడే పాండవుల కెదురు నిలవటానికి సమర్థులమని భావిస్తున్నారు. నీకు వచ్చిన భయమేమీ లేదింక. (28)
జేతుం సమగ్రాం సేనాం మే వాసవోఽపి న శక్నుయాత్।
హంతు మక్షయ్యరూపేయం బ్రహ్మణోఽపి స్వయంభువః॥ 29
సమగ్రమైన నా సేనను జయించటానికి ఇంద్రుడు కూడా చాలడు. స్వయంభువు అయిన బ్రహ్మ కూడా అక్షయమైన నా సేనను చంపలేడు. (29)
యుధిష్ఠిరః పురం హిత్వా పంచగ్రామాన్ స యాచతి।
భీతో హి మామకాత్ సైన్యాత్ ప్రభావాచ్పైవ మే విభో॥ 30
రాజా! నా సేనకూ, నా ప్రభావానికీ భయపడి గదా! ధర్మరాజు పురం వదలి అయిదు గ్రామాలను అడుగుతున్నాడు. (30)
సమర్థం మన్యసే యచ్చ కుంతీపుత్రం వృకోదరమ్।
తన్మిథ్యా న హి మే కృత్స్నం ప్రభావం వేత్సి భారత॥ 31
ఆ వృకోదరుడు(భీముడు) సమర్థుడని అనుకొంటున్నావు కాని అది నిజం కాదు. రాజా! నీకింకా నా ప్రభావం పూర్తిగా తెలియదు. (31)
మత్సమో హి గదా యుద్ధే పృథివ్యాం నాస్తి కశ్చన।
నాసీత్ కశ్చిదతిక్రాంతః భవితా చ న కశ్చన॥ 32
గదా యుద్ధంలో నాతో సమానుడు ఈ భూమి మీద లేడు. పూర్వం లేడు- ఇక ముందు ఉండడు. (32)
యుక్తో దుఃఖోషితశ్చాహం విద్యాపారగతస్తథా।
తస్మాచ్చ భీమాన్నాన్యేభ్యః భయం మే విద్యతే క్వచిత్॥ 33
నేను గురుకుల క్లేశంలో పట్టుదలతో చదివి విద్యలో తుది చూసినవాడను. అందుచేత నాకు భీముడన్నా, ఇతరులెవరన్నా భయం లేదు. (33)
దుర్యోధన సమో నాస్తి గదాయామితి నిశ్చయః।
సంకర్షణస్య భద్రం తే యత్తదైవ ముపావసమ్॥ 34
బలరాముని దగ్గర శిష్యునిగా ఉన్న రోజుల్లోనే "గదా యుద్ధంలో దుర్యోధనునకు సమానుడు లేడని" నిశ్చయం ఏర్పడింది. (34)
యుద్ధే సంకర్షణ సమః బలే నాభ్యధికో భువి।
గదా ప్రహారం భీమో మే న జాతు విషహేద్యుధి॥ 35
యుద్ధంలో కాని బలంలో కాని నేను బలరామునితో సమానుడను. నా గదా ప్రహారాన్ని భీముడెప్పుడూ తట్టుకోలేడు. (35)
ఏకం ప్రహారం యం దద్యాం భీమాయ రుషితో నృప।
స ఏవైనం నయేద్ఘోరః క్షిప్రం వైవస్వతక్షయమ్॥ 36
నేను కోపించి ఒక దెబ్బ కొడితే చాలు ఘోరమయిన ఆ దెబ్బ భీముని మరుక్షణంలో యముని యింటికి ఈడ్చుకొని పోతుంది. (36)
ఇచ్ఛేయం చ గదాహస్తం రాజన్ ద్రష్టుం వృకోదరమ్।
సుచిరం ప్రార్థితో హ్యేషః మమ నిత్యం మనోరథః॥ 37
చేతితో గద దాల్చిన వృకోదరుని చూడాలనుకొంటున్నాను - రాజా! ఎంతోకాలంగా నేను నిత్యమూ కోరుకొనే కోరిక ఇదే. (37)
గదయా నిహతో హ్యాజౌ మయా పార్థో వృకోదరః।
విశీర్ణగాత్రః పృథివీం పరాసుః ప్రపతిష్యతి॥ 38
గదతో నేను యుద్ధంలో కొడితే చాలు భీముని శరీరం పిండి పిండి అయిపోతుంది. ప్రాణాలు పోయి భీముడు నేల మీద పడతాడు. (38)
గదా ప్రహారాభిహతః హిమవానపి పర్వతః।
సకృన్మయా విదీర్యేత గిరిః శతసహస్రధా॥ 39
నేను ఒక్కసారి గదతో కొడితే హిమవత్పర్వతం కూడా వందలూ వేలూ(లక్ష) ముక్కలుగా పగిలిపోతుంది. (39)
స చాప్యేతద్విజానాతి వాసుదేవార్జునే తథా।
దుర్యోధన సమో నాస్తి గదాయామితి నిశ్చయః॥ 40
ఈ విషయం భీమునికీ తెలుసును - కృష్ణార్జునులకూ తెలుసును - అందుచేత "గదలో దుర్యోధనునితో సమానుడు లేడ"ని నిశ్చయమే. (40)
తత్తే వృకోదరమయం భయం వ్యేతు మహాహవే।
వ్యపనేష్యామ్యహం హ్యేనం మా రాజన్ విమనా భవ॥ 41
అందుచేత భీముని వల్ల భయం విడచిపెట్టు - మహాయుద్ధంలో వానిని నేనే సంహరిస్తాను. రాజా! నీవు మాత్రం మనసు పాడు చేసుకోకు. (41)
తస్మిన్ మయా హతే క్షిప్రమ్ అర్జునం బహవో రథాః।
తుల్యరూపా విశిష్టాశ్చ క్షేప్యంతి భరతర్షభ॥ 42
భీముడు నాచేత చనిపోయాక వెంటనే అర్జునునితో సమానులూ, అధికులూ అయిన రథికులు అర్జునుని ఎగరతన్నుతారు. (42)
భీష్మో ద్రోణః కృపో ద్రౌణిః కర్ణో భూరిశ్రవా స్తథా।
ప్రాగ్జ్యోతిషాధిపః శల్యః సింధురాజో జయద్రథః॥ 43
ఏకైక ఏషాం శక్తస్తు హంతుం భారత పాండవాన్।
సమేతాస్తు క్షణే నైతాన్ నేష్యంతి యమసాదనమ్॥ 44
భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవుడు, ప్రాగ్జ్యోతిష నగరాధిపతి భగదత్తుడు, శల్యుడు, సింధు దేశపు రాజు సైంధవుడు... వీరిలో ఎవరయినా ఒక్కొక్కరే పాండవులను సంహరించగలరు. ఇక అంతా కలిస్తే ఒక్క క్షణంలో యమలోకానికి పంపుతారు. (43,44)
సమగ్రా పార్థివీ సేనా పార్థమేకం ధనంజయమ్।
కస్మాదశక్తా నిర్జేతుం ఇతి హేతుర్నవిద్యతే॥ 45
సమగ్రమయిన ఈ రాజుల సేన అంతా కలిసి ఒక్క అర్జునుని జయించలేక పోవటానికి కారణం లేదు. (45)
శరవ్రాతైస్తు భీష్మేణ శతశో నిచితోఽవశః।
ద్రోణ ద్రౌణి కృపైశ్చైవ గంతా పార్థో యమక్షయమ్॥ 46
భీష్మద్రోణ కృపాశ్వత్థామల వందల బాణపరంపరలతో స్పృహతప్పి అర్జునుడు యమలోకానికి పోతాడు. (46)
పితామహోఽపి గాంగేయః శంతనోరథ భారత।
బ్రహ్మర్షి సదృశో జజ్ఞే దేవైరపి సుదుఃసహః॥ 47
ఈ పితామహుడు గంగా శంతనుల పుత్రుడు. బ్రహ్మర్షితో సమానుడు. దేవతలకు కూడ అసాధ్యుడు. (47)
న హంతా విద్యతే చాపి రాజన్ భీష్మస్య కశ్చన।
పిత్రా హ్యుక్తః ప్రసన్నేన నాకామస్త్వం మరిష్యసి॥ 48
రాజా! భీష్ముని చంపగలవా డెవడూ లేడు. "నీవు కోరుకోకుండా నీకు మరణం రాద"ని ప్రసన్నుడయిన తండ్రి వర మిచ్చాడు గదా! (48)
బ్రహ్మర్షేశ్చ భరద్వాజాత్ ద్రోణో ద్రోణ్యామజాయత।
ద్రోణాజ్జజ్ఞే మహారాజ ద్రౌణిశ్చ పరమాస్త్రవిత్॥ 49
బ్రహ్మర్షి అయిన భరద్వాజునకు ద్రోణుడు ఒక ద్రోణి/దొప్పలో పుట్టాడు. అశ్వత్థామ ద్రోణునికి పుట్టాడు. అతడు దివ్యాస్త్రవేత్త. (49)
కృపశ్చాచార్యముఖ్యోఽయం మహర్షేర్గౌతమా దపి।
శరస్తంభోద్భవః శ్రీమాన్ అవధ్య ఇతి మే మతిః॥ 50
ఆచార్య ముఖ్యుడయిన కృపుడు శరస్తంభం/రెలు నుండి గౌతమ మహర్షి వలన పుట్టాడు. కృపాచార్యుడు ఎవరి వల్లనూ చావడని నా అభిప్రాయం. (50)
అయోనిజా స్త్రయోహ్యేతే పితా మాతా చ మాతులః।
అశ్వత్థామ్నో మహారాజ స చ శూరః స్థితో మమ॥ 51
అశ్వత్థామ తండ్రి ద్రోణుడు, తల్లి కృపి, మేనమామ కృపుడు - ఈ ముగ్గురూ అయోనిజాలు. అంతటి వీరుడు అశ్వత్థామ నా పక్షాన ఉన్నాడు. (51)
సర్వ ఏతే మహారాజ దేవకల్పా మహారథాః।
శక్రస్యాపి వ్యథాం కుర్యుః సంయుగే భరతర్షభ॥ 52
మహారాజా! వీరంతా దేవతల్లాంటి వారు - మహారథులు - యుద్ధంలో దేవేంద్రుని కూడా బాధించగలరు. (52)
నైతేషా మర్జునః శక్తః ఏకైకం ప్రతి వీక్షితుమ్।
సహితాస్తు నరవ్యాఘ్రాః హనిష్యంతి ధనంజయమ్॥ 53
వీరిలో ఏ ఒక్కరినైనా సరే అర్జునుడు తేరిపారి చూడలేడు. ఇక అందరూ కలిస్తే ఈ మానవోత్తములు అర్జునుని చంపిపారేస్తారు. (53)
భీష్మద్రోణ కృపాణాం చ తుల్యః కర్ణో మతో మమ।
అనుజ్ఞాతశ్చ రామేన మత్సమోఽసీతొ భారత॥ 54
కర్ణుడు భీష్మద్రోణ కృపులతో సమానుడని నా అభిప్రాయం - "నీవు నాతో సమానుడవయ్యావు" అని పరశురాముడు కర్ణుని అంగీకరించాడు గదా! (54)
కుండలే రుచిరే చాస్తాం కర్ణస్య సహజే శుభే।
తే శచ్యర్థం మహేంద్రేణ యాచితః స పరంతపః॥ 55
కర్ణునికి సహజమైన చక్కని కవచకుండలాలుండేవి. వాటిని శచీదేవి కోసం ఇంద్రుడు యాచించి గ్రహించాడు. (55)
అమోఘయా మహారాజ శక్త్యా పరమభీమయా।
తస్య శక్త్యోపగూఢస్య కస్మాజ్జీవేత్ ధనంజయః॥ 56
మహారాజా! అమోఘమూ, భయంకరమూ అయిన (ఇంద్రుడిచ్చిన) శక్తి కల కర్ణుని ముందు నిలిచి అర్జునుడు జీవించగలడా? (56)
విజయో మే ధ్రువం రాజన్ ఫలం పాణావివాహితమ్॥ 57
విజయం నాకు కరతలామలకం - ఇది ధ్రువం. (57)
అభివ్యక్తః పరేషాం చ కృత్స్నో భువి పరాజయః।
శత్రువులకు పూర్తిగా పరాజయమే కలుగుతుందని భూమిపై చెప్పుకొంటున్నారు. (57)
అహ్నా హ్యేకేన భీష్మోఽయం ప్రయుతం హంతి భారత।
తత్సమాశ్చ మహేష్వాసాః ద్రోణ ద్రౌణి కృపా అపి॥ 58
ఈ భీష్ముడొక్కడే రోజుకు పదిలక్షల మందిని సంహరించగలడు. గొప్ప విలుకాండ్రయిన ద్రోణాశ్వత్థామలూ కృపుడూ కూడా భీష్మునితో సమానులే. (58)
సంశప్తకానాం బృందాని క్షత్రియాణాం పరంతప॥
అర్జునం వయ మస్మాన్ వా నిహన్యాత్ కపికేతనః।
తం చాలమితి మన్యంతే సవ్యసాచివధే ధృతాః॥ 59
క్షత్రియులైన సంశప్తక సమూహాలు "మేము అర్జునుని కాని, అర్జునుడు మమ్మల్ని కాని చంపాలి" అనుకొంటూ అర్జునవధకు తాము సమర్థులమని నిశ్చయం చేసుకొన్నారు. (59)
పార్థివాః స భవాంస్తేభ్యో హ్యకస్మాత్ వ్యథతే కథమ్।
భీమసేనే చ నిహతే కోఽన్యే యుద్ధ్యేత భారత॥ 60
రాజులంతా అలా అనుకొంటూ ఉంటే నీకు అకస్మాత్తుగా పాండవులంటే ఎందుకు భయం కలగాలి? ఆ భీముడొక్కడూ చనిపోతే ఇక వారిలో యుద్ధం చేసే వాడెవడున్నాడు. (60)
పరేషాం తన్మమాచక్ష్వ యది వేత్థ పరంతప।
పంచ తే భ్రాతరః సర్వే ధృష్టద్యుమ్నోఽథ సాత్యకిః॥ 61
సర్వేషాం సప్త మే రాజన్ యోధాః సారం బలం మతమ్।
అసలు వారిలో నీకు తెలిస్తే వీరుడెవడో నాకు చెప్పు - పాండవులు అయిదుగురు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, మొత్తం ఇంతా కలిసి ఏడుగురే కదా! (61)
అస్మాకం తు విశిష్టా యే భీష్మద్రోణ కృపాదయః॥ 62
ద్రౌణిర్వైకర్తనః కర్ణః సోమదత్తోఽథ బాహ్లికః।
ప్రాగ్జ్యోతిషాధిపః శల్యః ఆవంత్యౌ చ జయద్రథః॥ 63
దుఃశాసనో దుర్ముఖశ్చ దుస్సహశ్చ వివింశతిః।
శలో భూరిశ్రవాశ్చైవ వికర్ణశ్చ తవాత్మజః॥ 64
మనకయితే ప్రసిద్ధులు చాలామంది - భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, సూర్యపుత్రుడు కర్ణుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, ప్రాగ్జ్యోతిషరాజు భగదత్తుడు, శల్యుడు, అవంతి రాజు లిద్దరు, సైంధవుడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుస్సహుడు, వివింశతి, భూరిశ్రవుడు, నీ కుమారుడు వికర్ణుడు, మొదలయిన వారు ఎంతోమంది ఉన్నారు. (62,63,64)
అక్షౌహిణ్యో హి మే రాజన్ దశైకా చ సమాహృతాః।
మ్న్యానాః పరేషాం సప్తైవ కస్మాన్మే స్యాత్ పరాజయః॥ 65
రాజా! నాకు పదకొండు అక్షౌహిణులసేన చేరింది. శత్రువులకు చాలా తక్కువ... ఏడే అక్షౌహిణులు - నాకింక దేనివల్ల పరాజయం కలుగుతుంది? (65)
బలం త్రిగుణతో హీనం యోధ్యం ప్రాహ బృహస్పతిః।
పరేభ్యస్త్రిగుణా చేయం మమ రాజన్ననీకినీ॥ 66
మూడువంతుల తక్కువ గల సేనతో యుద్ధం చేయవచ్చునని బృహస్పతి చెప్పాడు. నాకిపుడు శత్రువుల కంటే మూడు వంతులు సేన ఎక్కువగానే ఉన్నది. (66)
గుణహీనం పరేషాం చ బహు పశ్యామి భారత।
గుణోదయం బహుగుణ మాత్మనశ్చ విశాంపతే॥ 67
రాజా! శత్రుబలం చాలా గుణ హీనంగానూ, నా బలం బహుగుణ సహితంగానూ కనపడుతోంది. (67)
ఏతత్సర్వం సమాజ్ఞాయ బలాగ్ర్యం మమ భారత।
న్యూనతాం పాండవానాం చ న మోహం గంతు మర్హతి॥ 68
ఇదంతా తెలిసికొని నా బలాధిక్యం, పాండవుల బలహీనతను అంతా తెలిసికొని నీవు మోహం చెందకు. (68)
ఇత్యుక్త్వా సంజయం భూయః పర్యపృచ్ఛత భారత।
వివిత్సుః ప్రాప్తకాలాని జ్ఞాత్వా పరపురంజయః॥ 69
ఇలా అని సమయోచిత కృత్యాలు తెలిసికొన గోరి దుర్యోధనుడు మళ్లీ సంజయునితో ఇట్లన్నాడు. (69)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి దుర్యోధన వాక్యే పంచపంచాశత్తమోఽధ్యాయ॥ 55 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున దుర్యోధన వాక్యమను ఏబది అయిదవ అధ్యాయము. (55)