119. నూటపందొమ్మిదవ అధ్యాయము
గాలవుడు మాధవిని యయాతికి తిరిగి ఇచ్చుట.
నారద ఉవాచ
గాలవం వైనతేయోఽథ ప్రహసన్నిదమబ్రవీత్।
దిష్ట్వా కృతార్థం పశ్యామి భవంతమిగ వై ద్విజ॥ 1
గరుడుడు గాలవుని చూచి నవ్వుతూ "ద్విజోత్తమా! అదృష్టం కొద్దీ కృతకృత్యుడయిన నిన్ను ఇక్కడ చూస్తున్నాను" అన్నాడు. (1)
గాలవస్తు వచః శ్రుత్వా వైనతేయేన భాషితమ్।
చతుర్భాగావశిష్టం తద్ ఆచఖ్యే కార్యమస్య హి॥ 2
గాలవుడు గరుడుని మాటలు విని "ఆ కార్యంలో ఇంకా నాలుగవ భాగం మిగిలి ఉంది" అని సమాధానం చెప్పాడు. (2)
సుపర్ణస్త్వబ్రవీదేనం గాలవం వదతాం వరః।
ప్రయత్నస్తే న కర్తవ్యః నైష సంపత్య్సతే తవ॥ 3
వాగ్మి అయిన గరుడుడు ఇలా అన్నాడు గాలవునితో - ఇక నీవు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ప్రయత్నించినా సఫలం కాదు. (3)
పురా హి కాన్యకుబ్జే వై గాధేః సత్యవతీం సుతామ్।
భార్యార్థేఽవరయత్ కన్యామ్ ఋచీకస్తేన భాషితః॥ 4
ఒకప్పుడు కాన్యకుజ్జంలో ఋచీకుడు గాధిరాజు కుమార్తె సత్యవతిని పరిణయమాడ గోరి వరించాడు. అప్పుడు గాధి ఋచీకునితో ఇలా అన్నాడు. (4)
ఏకతఃశ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసామ్।
భగవన్ నీయతాం మహ్యం సహస్రమితి గాలవ॥ 5
ఋచీకస్తు తథేత్యుక్త్వా వరుణస్యాలయం గతః।
అశ్వతీర్థే హయాన్ లబ్ధ్వా దత్తవాన్ పార్థివాయ వై॥ 6
స్వామీ! చంద్రవర్చస్సు గలిగి, ఒక చెవి వైపు నల్లగా కనిపించే గుఱ్ఱాలు ఒక వేయి నాకు ఇవ్వాలి. ఇవ్వగలనా! అన్నాడు. ఋచీకుడు అంగీకరించి బయలుదేరి వరుణలోకానికి పోయి, అశ్వతీర్థంలో అటువంటి గుఱ్ఱాలను సంపాదించి గాధిరాజు కిచ్చాడు. (5-6)
ఇష్ట్వా తే పుండరీకేణ దత్తా రాజ్ఞా ద్విజాతిషు।
తేభ్యో ద్వే ద్వే శతే క్రీత్వా ప్రాప్తే తైః పార్థివైస్తదా॥ 7
ఆయన పుండరీకయాగమ్ చేసి ఆ గుఱ్ఱాలను బ్రాహ్మణులకు దానం చేశారు. ఆ బ్రాహ్మణుల దగ్గర నుండి రాజులు రెండు రెండు వందల గుఱ్ఱాలను కొనుక్కొని తమ దగ్గర ఉంచుకొన్నారు. (7)
అపరాణ్యపి చత్వారి శతాని ద్విజసత్తమ।
నీయమానాని సంతారే హృతాన్యాసన్ వితస్తయా॥ 8
ద్విజశ్రేష్ఠా! మిగిలిన నాలుగు వందల గుఱ్ఱాలను తీసికొని పోతుండగా వితస్తానదిని దాటే సమయంలో ఆ గుఱ్ఱాలు నదీప్రవాహంలో కొట్టుకొనిపోయాయి. (8)
ఏవం న శక్యమప్రాప్యం ప్రాప్తుం గాలవ కర్హిచిత్।
ఇమా మశ్వశతాభ్యాం వై ద్వాభ్యాం తస్మై నివేదయ॥ 9
విశ్వామిత్రాయ ధర్మాత్మాన్ షడ్భిరశ్వశతైః సహ।
తతోఽసి గతసంమోహః కృతకృత్యో ద్విజోత్తమ॥ 10
ద్విజోత్తమా! గాలవా! ఈవిధంగా ఈ ఆరువందల గుఱ్ఱాలకన్నా ఎక్కువ ఎక్కడా దొరకవు. కాబట్టి నీవు సాధించలేవు. ధర్మాత్మా మిగిలిన రెండు వందల గుఱ్ఱాల బదులు ఈ కన్యనే ఆరువందల గుఱ్ఱాలతో పాటు విశ్వామిత్రునకు సమర్పించు. అప్పుడు నీ అవస్థలు తొలగి కృతకృత్యుడవు కాగలవు. (9-10)
గాలవస్తం తథేత్యుక్త్వా సుపర్ణసహితస్తతః।
ఆదాయాశ్వాంశ్చ కన్యాం చ విశ్వామిత్రముపాగమత్॥ 11
గాలవుడు అలాగేనని అంగీకరించి గుఱ్ఱాలనూ, మాధవినీ తీసికొని గరుత్మంతునితో పాటు విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. (11)
అశ్వానాం కాంక్షితార్థానాం షడిమాని శతాని వై।
శతద్వయేన కన్యేయం భవతా ప్రతిగృహ్యతామ్॥ 12
తమరు కోరిన గుఱ్ఱాలలో ఇవి ఆరువందలు. మిగిలిన రెండువందల గుఱ్ఱాల బదులు ఈ కన్యను స్వీకరించండి. (12)
అస్యాం రాజర్షిభిః పుత్రాః జాతా వై ధార్మికాస్త్రయః।
చతుర్థం జనయత్వేకం భవానపి నరోత్తమమ్॥ 13
ఈమె యందు ముగ్గురు రాజర్షులు, మువ్వురు పుత్రులను కన్నారు. తమరుకూడా నరోత్తముడైన నాలుగవ కొడుకును కనండి. (13)
పూర్ణాన్యేవం శతాన్యష్టౌ తురగాణాం భవంతు తే।
భవతా హ్యనృణో భూత్వా తపః కుర్యాం యథాసుఖమ్॥ 14
ఆ విధంగా ఎనిమిదివందల గుఱ్ఱాల గురుదక్షిణ పూర్తి అవుతుంది. మీ ఋణం నుండి విముక్తుడనై నేను సుఖంగా తపస్సు చేసికొంటాను. (14)
విశ్వామిత్రస్తు తం దృష్ట్వా గాలవం సహ పక్షిణా।
కన్యాం చ తాం వరారోహామ్ ఇదమిత్యబ్రవీద్ వచః॥ 15
విశ్వామిత్రుడు గాలవునీ, గరుడునీ, అందమయిన ఆ కన్యనూ చూచి ఇలా అన్నాడు. (15)
కిమియం పూర్వమేవేహ న దత్తా మమ గాలవ।
పుత్రా మమైవ చత్వారః భవేయుః కులభావనాః॥ 16
గాలవా! ఈమెను ఇంతకుముందే నా దగ్గరకు తీసికొని రావలసినది. కులప్రవర్తకులైన ఆ నలుగురు కొడుకులూ నాకే పుట్టేవారు గదా! (16)
ప్రతిగృహ్ణామి తే కన్యామ్ ఏకపుత్రఫలాయ వై।
అశ్వాశ్చాశ్రమమాసాద్య చరంతు మమ సర్వశః॥ 17
ఒక కుమారుని పొందటానికై నీ కన్యను స్వీకరిస్తున్నాను. ఈ గుఱ్ఱాలను నా ఆశ్రమానికి తెచ్చి విడు. స్వేచ్ఛగా అంతటా తిరుగుతాయి. (17)
స తయా రమమాణోఽథ విశ్వామిత్రో మహాద్యుతిః।
ఆత్మజం జనయామాస మాధవీపుత్రమష్టకమ్॥ 18
తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు ఆమెతో క్రీడించి కొడుకును కన్నాడు. అతని పేరు అష్టకుడు. (18)
జాతమాత్రం సుతం తం చ విశ్వామిత్రో మహామునిః।
సంయోజ్యార్థైస్తథా ధర్మైః అశ్వైస్తైః సమయోజయత్॥ 19
ఆ పుత్రుడు పుట్టగానే విశ్వామిత్ర మహాముని అతనిని ధర్మార్థాలతోనూ, ఆ గుఱ్ఱాలతోనూ సంపన్నుని చేశాడు. (19)
అథాష్టకః పురం ప్రాయాత్ తదా సోమపురప్రభమ్।
నిర్యాత్య కన్యాం శిష్యాయ కౌశికోఽపి వనం యయౌ॥ 20
అప్పుడు అషటకుడు చంద్రపుర కాంతితో సమానమైన కాంతిగల విశ్వామిత్రుని రాజధానికి వెళ్ళాడు. కన్యను శిష్యునకే ఇచ్చి విశ్వామిత్రుడు అడవులకు వెళ్ళిపోయాడు. (20)
గాలవోఽపి సుపర్ణేన సహ నిర్యాత్య దక్షిణామ్।
మనసాతిప్రతీతేన కన్యామిదమువాచ హ॥ 21
జాతో దానపతిః పుత్రః త్వయా శూరస్తథాపరః।
సత్యధర్మరతశ్చాన్యః యజ్వా చాపి తథాపరః॥ 22
తదాగచ్ఛ వరారోహే తారితస్తే పితా సుతైః।
చత్వారశ్చైవ రాజానః తథాచాహం సుమధ్యమే॥ 23
గాలవుడుకూడ గురుదక్షిణనిచ్చి మనస్సులో పరమానందపడి గరుడుని సమక్షంలో మాధవితో ఇలా అన్నాడు.
సుందరీ! నీ మొదటి కొడుకు దానపతి. రెండవవాడు శూరవీరుడు. మూడవవాడు సత్యధర్మపరాయణుడు. నాలుగవవాడు యజమాని.
నీవు ఈ కుమారుల ద్వారా నీ తండ్రిని కూడా తరింపజేశావు. నీ కుమారులను ఉద్ధరించావు. నన్ను కూడా ఋణవిముక్తుని చేశావు. ఇక పద. (21-23)
గాలవస్త్వభ్యనుజ్ఞాయ సుపర్ణం పన్నగాశనమ్।
పితుర్నిర్యాత్య తాం కన్యాం ప్రయయౌ వనమేవ హ॥ 24
అలా అని గాలవుడు గరుత్మంతుని అనుమతి తీసికొని, ఆ కన్యను - మాధవిని - తండ్రి చెంతకు చేర్చి తాను వనాలకు వెళ్ళిపోయాడు. (24)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే ఏకోనవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 119 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపందొమ్మిదవ అధ్యాయము. (119)