120. నూట ఇరువదవ అధ్యాయము

మాధవి తపస్సు చేయుట - యయాతి స్వర్గమున తేజోహీనుడగుట.

నారద ఉవాచ
స తు రాజా పునస్తస్యాః కర్తుకామః స్వయంవరమ్।
ఉపగమ్యాశ్రమపదం గంగాయమునసంగమే॥ 1
నారదుడిలా అన్నాడు.
ఆ యయాతి మహారాజు ఆ మాధవికి మరల స్వయంవరాన్ని ఏర్పాటు చేయదలచి గంగాయమునల సంగమస్థానంలోని తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించసాగాడు. (1)
గృహీతమాల్యదామాం తాం రథమారోప్య మాధవీమ్।
పూరుర్యదుశ్చ భగినీమ్ ఆశ్రమే పర్యధావతామ్॥ 2
చేత వరమాలను ధరించిన మాధవిని రథమెక్కించి ఆమె సోదరులు పూరుడూ, యదువూ, ఆశ్రమంలో వరుని కోసం వెదకసాగారు. (2)
నాగయక్షమనుష్యాణాం గంధర్వమృగపక్షిణామ్।
శైలద్రుమవనౌకానామ్ ఆసీత్తత్ర సమాగమః॥ 3
నాగులూ, యక్షులూ, మనుష్యులూ, గంధర్వులూ, పశు, పక్షిజాతికి చెందినవారూ, గిరిజనులూ, ఆటవికులూ అందరూ అక్కడ సమావేశమయ్యారు. (3)
నానాపురుషదేశ్యానామ్ ఈశ్వరైశ్చ సమాకులమ్।
ఋషిభిర్బ్రహ్మకల్పైశ్చ సమంతాదావృతం వనమ్॥ 4
ప్రయాగలోని ఆ వనం అనేక జనపదాలరాజులతో, బ్రహ్మకల్పులయిన మహర్షులతో అంతటా నిండిపోయింది. (4)
నిర్దిశ్యమానేషు తు సా వరేషు వరవర్ణినీ।
వరానుత్క్రమ్య సర్వాంస్తాన్ వరం వృతవతీ వనమ్॥ 5
ఆ వరులను గురించి చెపుతూఉంటే ఆ వరవర్ణిని వరులనందరినీ అతిక్రమించి తపోవనాన్నే వరునిగా ఎన్నుకొన్నది. (5)
అవతీర్య రథాత్ కన్యా నమస్కృత్య చ బంధుషు।
ఉపగమ్య వనం పుణ్యం తపస్తేపే యయాతిజా॥ 6
ఆ యయాతిపుత్రి రథం నుండి దిగి, బంధువులకందరకూ నమస్కరించి, పవిత్రమైన తపోవనాన్ని చేరి తపస్సు చేయసాగింది. (6)
ఉపవాసైశ్చ వివిధైః దీక్షాభిర్నియమైస్తథా।
ఆత్మనో లఘుతాం కృత్వా బభూవ మృగచారిణీ॥ 7
రకరకాల ఉపవాసాలతో, వివిధ దీక్షలతో, నియమాలతో రాగద్వేషాలు లేని మనస్సుతో ఆమె అరణ్యంలో మృగంవలె చరించసాగింది. (7)
వైడూర్యాంకురకల్పాని మృదూని హరితాని చ।
చరంతీ శ్లక్ష్ణశష్పాణి తిక్తాని మధురాణి చ॥ 8
స్రవంతీనాం చ పుణ్యానాం సురసాని శుచీని చ।
పిబంతీ వారిముఖ్యాని శీతాని విమలాని చ॥ 9
వనేషు మృగవాసేషు వ్యాఘ్రవిప్రోషితేషు చ।
దావాగ్ని విప్రయుక్తేషు శున్యేషు గవానేషు చ॥ 10
చరంతీ హరిణైః సార్ధం మృగీవ వనచారిణీ।
చచార విపులం ధర్మం బ్రహ్మచర్యేణ సంవృతమ్॥ 11
ఈ విధంగా ఆమె వైడూర్యపు మొలకల వంటి శోభగలిగి, పచ్చగా, మృదువుగా, వగరుగా, తీయగా ఉన్న గడ్డిపరకలను భుజిస్తూ, శుభ్రమై, పవిత్రమై, చల్లగా ఉన్న పవిత్రనదీ జలాలను త్రాగుతూ, మృగాలకు నివాసస్థానమైన, పులులూ, దావాగ్ని లేని దుర్గమనిర్జనారణ్యాలలో జింకలతో బాటు జింకవలె సంచరిస్తూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విస్తృతంగా ధర్మపాలన చేసింది. (8-11)
యయాతిరపి పూర్వేషాం రాజ్ఞాం వృత్తమమష్ఠితః।
బ్రహ్మవర్షసహస్రాయుః యుయుజే కాలదర్మణా॥ 12
యయాతి కూడా ప్రాచీనరాజన్యుల మార్గాన్ని అనుసరించి సదాచారాలను పాటిస్తూ వేల సంవత్సరాలు జీవించి కాలధర్మం చెందాడు. (12)
పూరుర్యదుశ్చ ద్వౌ వంశే వర్ధమానౌ నరోత్తమౌ।
తాభ్యాం ప్రతిష్ఠితో లోకే పరలోకే చ నాహుషః॥ 13
యయాతి కుమారులయిన పూరువు, యదువు నరోత్తములై వంశోద్ధారకు లైరి. వారి వలన నహుషపుత్రుడు యయాతి ఇహపరలోకాలలో ప్రతిష్ఠను పొందాడు. (13)
మహీపతే నరపతిః యయాతిః స్వర్గమాస్థితః।
మహర్షికల్పో నృపతిః స్వర్గాగ్ర్యఫలభుక్ విభుః॥ 14
రాజా! యయాతి మహారాజు మహర్షులవలె పుణ్యాత్ముడూ, తపస్వి అయి స్వర్గాన్ని చేరి అక్కడ స్వర్గంలోని ఉత్తమస్థాయి ఫలాలను అనుభవించసాగాడు. (14)
బహువర్షసహస్రాఖ్యే కాలే బహుగుణే గతే।
రాజర్షిషు నిషణ్ణేషు మహీయస్సు మహర్దిషు॥ 15
అవమేనే వరాన్ సర్వాన్ దేవానృదిగణాంస్తథా।
యయాతిర్మూఢవిజ్ఞానః విస్మయావిష్టచేతనః॥ 16
ఈ విధంగా ఆ స్వర్గలోకంలో కొన్ని వేల సంవత్సరాలు గడచిపోయాయి. యయాతి తాననుభవిస్తున్న స్వర్గసుఖాలను చూచి తానే ఆశ్చర్యపోయాడు. ఆయన బుద్ధిని మైకం క్రమ్మింది. తన ప్రక్కన ఎందరో మహాత్ములు, మహోన్నతులైన రాజర్షులు కూర్చొని ఉన్నా మనుష్యులను, దేవతలను ఋషిగణాన్ని అవహేళన చేయసాగాడు. (15-16)
తతస్తం బుబుధే దేవః శక్రో బలనిషూదనః।
తే చ రాజర్షయ స్సర్వే ధిగ్ ధిగిత్యేవమబ్రువన్॥ 17
ఆపై యయాతి పరిస్థితిని బలనిషూదనుడైన ఇంద్రుడు తెలిసికొన్నాడు. రాజర్షులందరూ యయాతిని అసహ్యించు కొనసాగారు. (17)
విచారశ్చ సముత్పన్నః నిరీక్ష్య నహుషాత్మజమ్।
కో న్వయం కస్య వా రాజ్ఞః కథం వా స్వర్గమాగతః॥ 18
అప్పుడు యయాతిని చూచిన స్వర్గవాసులు ఇలా వితర్కించసాగారు - ఎవరీయన? ఏ రాజు కొడుకు? స్వర్గానికి ఎలా వచ్చాడు? (18)
కర్మణా కేన సిద్ధోఽయం క్వ వానేన తపశ్చితమ్।
కథం హి జ్ఞాయతే స్వర్గే కేన వా జ్ఞాయతేఽప్యుత॥ 19
ఏ పనిచేసి ఈయన సిద్ధిపొందాడు? ఎక్కడ తపస్సు చేశాడు? స్వర్గలోకంలో ఈయనకు గల గుర్తింపు ఏమిటీ? ఎలాగుర్తింపు పొందాడు? (19)
ఏవం విచారయంతస్తే రాజానం స్వర్గవాసినః।
దృష్ట్వా పప్రచ్ఛురన్యోన్యం యయాతిం నృపతిం ప్రతి॥ 20
ఈ విధంగా ఆలోచిస్తున్న స్వర్గ వాసులు ఒకరినొకరు యయాతిని గురించి ప్రశ్నించుకోసాగారు. (20)
విమానపాలాః శతశః స్వర్గద్వారాభిరక్షిణః।
పృష్టా ఆసనపాలాశ్చ న జానీమేత్యథాబ్రువన్॥ 21
వందలకొలదిగా ఉన్న విమానరక్షకులనూ, స్వర్గద్వార రక్షకులనూ, సింహాసన సంరక్షకులనూ అడిగారు. అందరూ కూడా "తెలియదనే" సమాధానమిచ్చారు. (21)
సర్వే తే హ్యావృతజ్ఞానా నాభ్యజానంత తం నృపమ్।
స ముహూర్తాదథ నృపః హతౌజాశ్చాభవత్ తదా॥ 22
వారందరి జ్ఞానాన్ని తెరలు కప్పివేశాయి. ఎవ్వరూ కూడా ఆయనను గుర్తించలేకపోయారు. అప్పుడు క్షణకాలంలో యయాతిరాజు తన తేజస్సును కోల్పోయాడు. (22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే యయాతిమోహే వింశత్యధికశతతమోఽధ్యాయః॥ 120 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమున యయాతి మోహమును నూట ఇరువదవ అధ్యాయము. (120)