121. నూట ఇరువదియొకటవ అధ్యాయము
యయాతి స్వర్గభ్రష్టుడగుట.
నారద ఉవాచ
అథ ప్రచలితః స్థానాత్ ఆసనాచ్చ పరిచ్యుతః।
కంపితేనేవ మనసా ధర్షితః శోకవహ్నినా॥ 1
నారదుడిలా అన్నాడు.
ఆ తరువాత యయాతి తన సింహాసనం నుండి పడి తన స్వర్గస్థానాన్ని కూడా కోల్పోయాడు. మనస్సు కంపించింది. శోకం ఆయనను దహించసాగింది. (1)
మ్లానసంభ్రష్టవిజ్ఞానః ప్రభ్రష్టముకుటాంగదః।
విఘూర్ణన్ ప్రస్తసర్వాంగః ప్రభ్రష్టాభరణంబరః॥ 2
తాను ధరించిన దివ్యకుసుమమాల వాడిపోయింది. తన జ్ఞానం నశించిపోయింది. కిరీటం, అంగదాలు తొలగిపోయాయి. శరీరావయవాలు పట్టుతప్పాయి. ఆభరణాలు, వస్త్రాలు జారిపోసాగాయి. మనిషి పరిభ్రమించసాగాడు. (2)
అదృశ్యమానస్తాన్ పశ్యన్ అపశ్యంశ్చ పునః పునః।
శూన్యః శూన్యేన మనసా ప్రపతిష్యన్మహీతలమ్॥ 3
కిం మయా మనసా ధ్యాతమ్ అశుభం ధర్మదూషణమ్।
యేనాహం చలితః స్థానాద్ ఇతి రాజా వ్యచింతయత్॥ 4
తానెవ్వరికీ కనిపించటం లేదు. తనకు మాత్రం వారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. మరలా అదృశ్యమవుతున్నారు. నేలమీదకు పడిపోతూ పూర్తిగా శూన్యమయిన మనస్సులో "నేను ధర్మాన్ని దూషించే ఏ అశుభాన్నో మనసా భావించి ఉంటాను. అందుకే స్థానభ్రష్టుడనయ్యాను" అని విచారించసాగాడు. (3-4)
తౌ తు తత్రైవ రాజానః సిద్ధాశ్చాప్సరసస్తథా।
అపశ్యంత నిరాలంబం తం యయాతిం పరిచ్యుతమ్॥ 5
అయితే స్వర్గలోకంలో ఉన్న రాజర్షులు, సిద్ధులు, అచ్చరలు ఆ విధంగా భ్రష్టుడైన్ ఆధారాన్ని కోల్పోయిన యయాతిని చూచారు. (5)
అథైత్య పురుషః కశ్చిత్ క్షీణపుణ్యనిపాతికః।
యయాతిమబ్రవీద్ రాజన్ దేవరాజస్య శాసనాత్॥ 6
రాజా! అప్పుడు పుణ్యం తరిగి పోయినవారిని స్వర్గం నుండి గిరవాటువేసే వ్యక్తి ఒకడు వచ్చి దేవేంద్రుని ఆజ్ఞ ననుసరించి యయాతితో ఇలా అన్నాడు. (6)
అతీవ మదమత్తస్త్వం న కంచిన్నావమన్యసే।
మానేన భ్రష్టః స్వర్గస్తే నార్హస్త్వం పార్థివాత్మజ॥ 7
రాజకుమారా! నీవు బాగా పొగరెక్కి ఉన్నావు. స్వర్గంలో నీవు హేళన చేయని మహాత్ముడెవ్వడూ లేడు. ఈ పొగరు వల్ల నీవు స్థానాన్ని కోల్పోయావు. నీవిక ఇక్కడ ఉండదగదు. (7)
న చ ప్రజ్ఞాయసే గచ్ఛ పతస్వేతి తమబ్రవీత్।
పతేయం సత్స్వితి వచః త్రిరుక్త్వా నహుషాత్మజః॥ 8
ఇక్కడెవ్వరూ నిన్ను గుర్తించటం లేదు. పడిపో ఆ మాట అతడు అనగానే "నేను మంచి వాళ్ళ మధ్యనే పడాలి" అని ముమ్మారు పలికి యయాతి క్రిందకు పడసాగాడు. (8)
పతిష్యంశ్చింతయామాస గతిం గతిమతాం వరః।
ఏతస్మిన్నేవ కాలే తు నైమిషే పార్థివర్షభాన్॥ 9
చతురో-పశ్యత నృపః తేషాం మధ్యే పపాత హ।
జంగమశ్రేష్ఠుడైన యయాతి పడిపోతూ తన గతిని గురించి ఆలోచించసాగాడు. అదే సమయంలో అతడు నైమిసారణ్యంలో నలుగురు రాజశ్రేష్ఠులను చూచి వారి మధ్య పడసాగాడు. (9)
ప్రతర్ధనో వసుమనాః శిబిరౌశీనరోఽష్టకః॥ 10
వాజపేయేన యజ్ఞేన తర్పయంతి సురేశ్వరమ్।
అక్కడ ప్రతర్దనుడు, వసుమనుడు, శిబి, అష్టకుడూ వాజపేయమాగం చేస్తూ దేవేంద్రుని తృప్తి పరుస్తున్నారు. (10)
తేషానుమధ్వరజం ధూమం స్వర్గద్వారముపస్థితమ్॥ 11
యయాతిరుపజిఘ్రన్ వై నిపపాత మహీం ప్రతి।
వారి హోమాగ్ని ధూమం స్వర్గానికి ద్వారమన్నట్లుగా వ్యాపించి ఉంది. యయాతి దానిని ఆఘ్రాణించి నేలపై పడసాగాడు. (11)
భూమౌ స్వర్గే చ సంబద్ధాం నదీం ధూమమయీమివ।
గంగాం గామివ గచ్ఛంతీమ్ ఆలంబ్య జగతీపతిః॥ 12
శ్రీమత్స్వవభృథాగ్ర్యేషు చతుర్షు ప్రతిబంధుషు।
మధ్యే నిపతితో రాజా లోకపాలోపమేషు సః॥ 13
భూమినీ, స్వర్గాన్నీ కలుపుతూ ధూమమయమయిన నది ప్రవహిస్తున్నట్టుంది. నేలకు దిగుతున్న గంగలా ఆ ధూమం కనిపిస్తోంది. ఆ ధూమ మార్గాన్ని ఆలంబనం చేసికొని ఆ యయాతి మహారాజు సమానతేజస్కులై, అవభృథస్నాన పవిత్రుడై లోకపాలకులతో సమానంగా ఉన్న తన బంధువులైన ఆ నలుగురి మధ్య పడ్డాడు. (12-13)
చతుర్షు హుతకల్పేషు రాజసింహమహాగ్నిషు।
పపాత మధ్యే రాజర్షిః యయాతిః పుణ్యసంక్షయే॥ 14
ఆ నలుగురు రాజుశ్రేష్ఠులు నాలుగు అగ్నులవలె తేజోవంతులై, ఆహుతులను పొంది ప్రజ్వలిస్తున్నారు. తన పుణ్యం పూర్తికాగానే యయాతి వారి మధ్య పడిపోయాడు. (14)
తమాహుః పార్థివాః సర్వే దీప్యమానమివ శ్రియా।
కో భవాన్ కస్యవా బంధుః దేశస్య నగరస్య వా॥ 15
యక్షో వాప్యథనా దేవః గంధర్వో రాక్షసోఽపి వా।
న హి మానుషరూపోఽసి కోవార్థః కాంక్ష్యతే త్వయా॥ 16
దివ్యకాంతితో శోభిస్తున్న ఆ యయాతితో ఆ రాజులు ఇలా అన్నారు. నీవెవడవు? ఎవరి బాంధవుడవు? ఏ దేశానికి, ఏ నగరానికి చెందినవాడవు? నీవు యక్షుడవా? దేవతవా? గంధర్వుడవా? లేక రాక్షసుడవా? మానవుడిలాగా కనిపించటం లేదు? నీకేమి కావాలి? (15-16)
యయాతిరువాచ
యయాతిరస్మి రాజర్షిః క్షీణపుణ్యశ్చ్యుతో దివః।
పతేయం సత్స్వితి ధ్యాయన్ భవత్సు పతితస్తతః॥ 17
యయాతి ఇలా అన్నాడు.
నేను యయాతి అనే పేరుగల రాజర్షిని, పుణ్యం తరిగి స్వర్గం నుండి భ్రష్టుడనయ్యాను. నేలబడుతూ మిమ్ములను మంచివారుగా భావించి మీ మధ్య పడ్డాను. (17)
రాజాన ఊచుః
సత్యమేతద్ భవతు తే కాంక్షితం పురుషర్షభ।
సర్వేషాం నః క్రతుఫలం ధర్మశ్చ ప్రతిగృహ్యతామ్॥ 18
రాజులు ఇలా అన్నారు. పురుషశ్రేష్ఠా! నీ కోరిక సఫలమవుతుంది. మా అందరి యాగఫలితాన్ని, ధర్మఫలితాన్ని నీవు స్వీకరించు. (18)
యయాతి రువాచ
నాహం ప్రతిగ్రహధనః బ్రాహ్మణః క్షత్రియో హ్యహమ్।
న చ మే ప్రవణా బుద్ధిః పరపుణ్యవినాశనే॥ 19
యయాతి ఇలా అన్నాడు.
బ్రాహ్మణుడికి దానం పట్టటమే సంపద కావచ్చు. కానీ నేను క్షత్రియుడను. కాబట్టి నా మనస్సు ఇతరుల పుణ్యాన్ని నా కోసం ఖర్చుచేయటానికి అంగీకరించటం లేదు. (19)
నారద ఉవాచ
ఏతస్మిన్నేవ కాలే తు మృగచర్యాక్రమాగతామ్।
మాధవీం ప్రేక్ష్య రాజానః తేవ్భివాద్యేదమబ్రువన్॥ 20
కిమాగమనకృత్యం తే కిం కుర్మః శాసనం తవ।
ఆజ్ఞాప్యా హి వయం సర్వే తవ పుత్రాస్తపోధనే॥ 21
నారదుడిలా అన్నాడు. అదే సమయంలో జింకలలో ఒక జింకగా తిరుగుతూ అక్కడకు వచ్చిన తమ తల్లిని - మాధవిని - చూచి రాజులు ఆమెకు నమస్కరించి ఇలా అన్నారు.
తపస్వినీ! ఏ పనిపడి మా దగ్గరకు వచ్చావు? మేము ఏం చేయాలి? మేము నీ బిడ్డలం. ఏం చేయమంటావో ఆజ్ఞాపించు. (20-21)
తేషాం తద్భాషితం శ్రుత్వా మాధవీ పరయా ముదా।
పితరం సముపాగచ్ఛన్ యయాతిం సా వవంద చ॥ 22
వారి మాటలను విని మాధవి పరమానందంతో తనతండ్రి అయిన యయాతి చెంతకు చేరి నమస్కరించింది. (22)
స్పృష్ట్వా మూర్ధని తాన్ పుత్రాన్ తాపసీ వాక్యమబ్రవీత్।
దౌహిత్రాస్తవ రాజేంద్ర మమ పుత్రా న తే పరాః॥ 23
తన కుమారులను శిరస్సులను స్పృశించి ఆ మాధవి ఇలా అన్నది. రాజశ్రేష్ఠా! వీరు నీ దౌహిత్రులు, నా కుమారులు, పరాయివారు కాదు. (23)
ఇమే త్వాం తారయిష్యంతి దృష్టమేతత్ పురాతనే।
అహం తే దుహితా రాజన్ మాధవీ మృగచారిణీ॥ 24
వీరు నిన్ను తరింపజేస్తారు. దౌహిత్రులు మాతామహులను ఉద్ధరించటం క్రొత్త విషయమేమీ కాదు. నేను నీ పుత్రిని మాధవిని. జింకలా ఈ అడవిలో తిరుగుతుంటాను. (24)
మయాప్యుపచితో ధర్మః తతోఽర్దం ప్రతిగృహ్యతామ్।
యస్మాన్ రాజన్ నరాః సర్వే అపత్యఫలభాగినః॥25
తస్మాదిచ్ఛంతి దౌహిత్రాన్ యథా త్వం వసుధాధిప।
నేను కూడా కూడబెట్టిన ధర్మమున్నది. దానిలో సగభాగాన్ని స్వీకరించండి. రాజేంద్రా! మనుష్యులంతా తమ సంతతి చేసిన సత్కర్మల ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకని వారు తమలాగే దౌహిత్రులను కోరుకుంటారు. (25 1/2)
తతస్తే పార్థివాః సర్వే శిరసా జననీం తదా॥ 26
అభివాద్య నమస్కృత్య మాతామహమథాబ్రువన్।
ఉచ్చైరనుపమైః స్నిగ్ధైః స్వరైరాపూర్య మేదినీమ్॥ 27
మాతామహం నృపతయః తారయంతో దివశ్చ్యుతమ్।
అప్పుడు ఆ రాజులందరూ తల్లిపాదాలపై బడి నమస్కరించి, అసాధారణమూ, స్నిగ్ధమూ అయిన పెద్ద కంఠంతో భూమిని ప్రతిధ్వనింపజేస్తూ, స్వర్గభ్రష్టుడైన మాతామహుని తరింపజేస్తూ ఏదో అనబోయారు. (26 27 1/2)
అథ తస్మాదుపగతః గాలవోఽప్యాహ పార్థివమ్।
తపసో మేఽష్టభాగేన స్వర్గమారోహతాం భవాన్॥ 28
అంతలో ఆ అరణ్యం నుండియే గాలవుడు కూడా వచ్చి "నా తపస్సులోని ఎనిమిదవ భాగాన్ని స్వీకరించి తమరు స్వర్గలోకాన్ని చేరండి" అన్నాడు. (28)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే యయాతిస్వర్గభ్రంశే ఏకవింశాధికశతతమోఽధ్యాయః॥ 121 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమున యయాతి స్వర్గభ్రంశమను నూట ఇరువదియొకటవ అధ్యాయము. (121)