122. నూట ఇరువది రెండవ అధ్యాయము
యయాతి మరల స్వర్గమునకు చేరుట.
నారద ఉవాచ
ప్రత్యభిజ్ఞాతమాత్రోఽథ సద్భిస్తైర్నరపుంగవః।
సమారురోహ నృపతిః అస్పృశన్ వసుధాతలమ్।
యయాతిర్దివ్యసంస్థానః బభూవ విగతజ్వరః॥ 1
దివ్యమాల్యాంబరధరః దివ్యాభరణభూషితః।
దివ్యగంధగుణోపేతః న పృథ్వీమస్పృశత్ పదా॥ 2
నారదుడిలా అన్నాడు.
ఆ సజ్జనుల గుర్తింపు పొందగానే నరోత్తముడైన యయాతి భూమిని స్పృశించకుండానే పైకి పోసాగాడు. ఆయనకు దివ్యాకృతి లభించింది. శోకం తొలగిపోయింది. దివ్యా భరణాలు, దివ్యవస్త్రాలు, దివ్యసుమమాలలు, దివ్యపరిమళాలు కలిగి కాలు నేలకు తగులకుండా నిలిచాడు. (1-2)
తతో వసుమనాః పూర్వమ్ ఉచ్చైరుచ్చారయన్ వచః।
ఖ్యాతో దానపతిర్లోకే వ్యాజహర నృపం తదా॥ 3
అప్పుడు అందరికన్నా ముందుగా దానపతిగా ప్రసిద్ధి పొందిన వసుమనుడు బిగ్గరగా యయాతి మహారాజుతో ఇలా అన్నాడు. (3)
ప్రాప్తవానస్మి యల్లోకే సర్వవర్ణేష్వగర్హయా।
తదప్యథ చ దాస్యామి తేన సంయుజ్యతాం భవాన్॥ 4
నేను లోకంలో ఏ వర్ణాన్ని నిందించకుండా పొందిన పుణ్యాన్ని కూడా తమకిస్తున్నాను. ఆ పుణ్యం మీకు దక్కుతుంది. (4)
యత్ఫలం దానశీలస్య క్షమాశీలస్య యత్ఫలమ్।
యచ్చ మే ఫలమాధానే తేన సంయుజ్యతాం భవాన్॥ 5
దానశీలునకు లభించే పుణ్యఫలం, సహనశీలికి లభించే పుణ్యఫలం, అగ్నిస్థాపనాది వేదోక్తకర్మల నాచరించినందువలన నాకు లభించే పుణ్యఫలం అంతా తమరు స్వీకరించండి. (5)
తతః ప్రతర్దనోఽప్యాహ వాక్యం క్షత్రియపుంగవః।
యథా ధర్మపతిర్నిత్యం నిత్యం యుద్ధపరాయణః॥ 6
ప్రాప్తవానస్మి యల్లోకే క్షత్రవంశోద్భవం యశః।
వీరశబ్దఫలం చైవ తేన సంయుజ్యతాం భవాన్॥ 7
అప్పుడు క్షత్రియశ్రేష్ఠుడైన ప్రతర్దనుడు ఇలా అన్నాడు. నిరతమూ ధర్మతాత్పర్యం కలిగి ఉండటం వలన నిత్యమూ ధర్మబద్ధమైన యుద్ధాలమీదనే ఆసక్తి చూపినందువలన, లోకంలో క్షత్రియునకు తగినట్లు కీర్తినీ, పరాక్రమాన్నీ సాధించినందువలన నాకు లభించే పుణ్యఫలం తమకు దక్కుతుంది. (6-7)
శిబిరౌశీనరో ధీమాన్ ఉవాచ మధురాం గిరమ్।
యథా బాలేషు నారీషు వైహార్యేషు తథైవ చ॥ 8
సంగరేషు నిపాతేషు తథా తద్వ్యసనేషు చ।
అనృతం నోక్తపూర్వం మే తేన సత్యేన ఖం వ్రజ॥ 9
యథా ప్రాణాంశ్చ రాజ్యం చ రాజన్ కామసుఖాని చ।
త్యజేయం న పునస్సత్యం తేన సత్యేన ఖం వ్రజ॥ 10
యథా సత్యేన మే ధర్మః యథా సత్యేన పావకః।
ప్రీతః శతక్రతుశ్చైవ తేన సత్యేన ఖం వ్రజ॥ 11
ఆపై ఉశీనరకుమారుడూ, బుద్ధిమంతుడూ అయిన శిబి ఇలా మధురంగా పలికాడు.
బాలురతో కానీ, స్త్రీలతో కానీ, పరిహాసయోగ్యులయిన బంధువులతో కానీ, యుద్ధంలో కానీ, ప్రమాదాలలో కానీ ఇబ్బందులలో కానీ నేను అసత్యం పలకలేదు. ఆ సత్యఫలంతో స్వర్గానికి వెళ్ళు.
రాజా! నేను ప్రాణాలనైనా, రాజ్యాన్ని అయినా, కామసుఖాలనయినా వదలగలను కానీ సత్యాన్ని విడువను. ఆ సత్యఫలంతో స్వర్గానికి వెళ్ళు.
నా సత్య పరిపాలనతో ధర్మదేవత, అగ్ని, ఇంద్రుడూ సంతృప్తులయితే ఆ సత్య ఫలంతో స్వర్గానికి వెళ్ళు. (8-11)
అష్టకస్త్వథ రాజర్షిః కౌశికో మాధవీసుతః।
అనేకశతయజ్వానం నాహుషం ప్రాప్య ధర్మవిత్॥ 12
ఆ తరువాత మాధవి చిన్నకొడుకూ, కౌశికుడూ, ధర్మజ్ఞుడూ, రాజర్షి అయిన అష్టకుడు వందల యాగాలు చేసిన యయాతి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. (12)
శతశః పుండరీకా మే గోసవాశ్చరితాః ప్రభో।
క్రతవో వాజపేయాశ్చ తేషాం ఫలమవాప్నుహి॥ 13
న మే రత్నాని న ధనం న తథాన్యే పరిచ్ఛదాః।
క్రతుష్వనుపయుక్తాని తేన సత్యేన ఖం వ్రజ॥ 14
స్వామీ! నేను వందలకొలదిగ పుండరీక, గోసవ, వాజపేయ యాగాలను చేశాను. వాటి ఫలితాన్ని నీవు పొందు. నా దగ్గర రత్నాలు కానీ, దనం కానీ, ధాన్యం కానీ మరే సామగ్రీ కానీ లేవు. అవన్నీ యాగాల కొరకే ఉపయోగించాను. ఆ సత్ఫలంతో స్వర్గానికి వెళ్ళు. (13-14)
యథా యథా హి జల్పంతి దౌహిత్రాస్తం నరాధిపమ్।
తథా తథా వసుమతీః త్యక్త్వా రాజా దివం యయౌ॥ 15
దౌహిత్రులు యయాతితో ఒక్కొక్కరుగా అంటుంటే యయాతి మహారాజు కొంచెం కొంచెంగా భూమికి దూరమవుతూ స్వర్గలోకంవైపు వెళ్ళాడు. (15)
ఏవం సర్వే సమస్తైస్తే రాజానః సుకృతైస్తదా।
యయాతిం స్వర్గతో భ్రష్టం తారయామాసురంజసా॥ 16
ఈ విధంగా ఆ నలుగురు రాజులూ తమతమ కర్మఫలాలతో స్వర్గభ్రష్టుడయిన ఆ యయాతిని తేలికగా తరింపజేశారు. (16)
దౌహిత్రాః స్వేన ధర్మేణ యజ్ఞదానకృతేన వై।
చతుర్షు రాజవంశేషు సంభూతాః కౌలవర్ధనాః।
మాతామహం మహాప్రాజ్ఞం దివమారోపయంత తే॥ 17
నాలుగు రాజవంశాలలో పుట్టి వంశ వర్ధనులైన ఆ నలుగురు దౌహిత్రులు తమ ధర్మఫలంతో, యజ్ఞదానఫలంతో మహాప్రాజ్ఞుడూ, మాతామహుడూ అయిన యయాతిని స్వర్గలోకానికి పంపించారు. (17)
రాజాన ఊచుః
రాజధర్మగుణోపేతాః సర్వధర్మగుణాన్వితాః।
దౌహిత్రాస్తే వయం రాజన్ దివమారోహ పార్ధివ॥ 18
రాజులు ఇలా అన్నారు.
రాజా! రాజధర్మానికి తగిన గుణాలతోనూ, సమస్త ధర్మాలతోనూ, సద్గుణాలతోనూ సంపన్నులమైన మేము. నీ దౌహిత్రులము. మా పుణ్యఫలంతో నీవు స్వర్గానికి వెళ్ళు. (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే యయాతిస్వర్గారోహణే ద్వావింశధికశతతమోఽధ్యాయః॥ 122 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమున యయాతి స్వర్గారోహణమను నూట ఇరువది రెండవ అధ్యాయము. (122)