123. నూట ఇరువది మూడవ అధ్యాయము

యయాతి స్వర్గపతన కారణమును నారదుడు దుర్యోధనునకు తెలుపుట.

నారద ఉవాచ
సద్భిరారోపితః స్వర్గం పార్థివైర్భూరిదక్షిణైః।
అభ్యనుజ్ఞాయ దౌహిత్రాన్ యయాతిర్దివమాస్థిత॥ 1
నారదుడిలా అన్నాడు.
భూరిదక్షిణల నివ్వగల మంచిరాజులచేత యయాతి స్వర్గానికి పంపబడ్డాడు. యయాతి మహారాజు తన దౌహిత్రుల నుండి వీడుకోలు తీసుకొని స్వర్గానికి వెళ్ళాడు. (1)
అభివృష్టశ్చ వర్షేణ నానాపుష్పసుగంధినా।
పరిష్వక్తశ్చ పుణ్యేన వాయునా పుణ్యగంధినా॥ 2
అక్కడ యయాతిపై పరిమళభరితమైన వివిధ కుసుమాల వాన కురిసింది. సువాసనలు గల పవిత్రవాయువు ఆయనను చుట్టుముట్టింది. (2)
అచలం స్థానమాసాద్య దౌహిత్రఫలనిర్జితమ్।
కర్మభిః స్వైరుపచితః జజ్వాల పరయా శ్రియా॥ 3
తన సత్కర్మల చేత ఎదిగిన యయాతి మహారాజు దౌహిత్రుల పుణ్యఫలంచేత లభించిన నిశ్చలస్థానాన్ని పొంది గొప్పగా ప్రకాశించాడు.(3)
ఉపగీతోపనృత్తశ్చ గంధర్వాప్సరసాం గణైః।
ప్రీత్యా ప్రతిగృహీతశ్చ స్వర్గే దుందుభినిఃస్వనైః॥ 4
గంధర్వులు, అచ్చరలు ఆయన కీర్తిని గానంచేస్తూ, ఆయన చెంత నాట్యం చేస్తూ ఆనందింపజేశారు. స్వర్గలోకం లోనికి దుంధుభి ధ్వనులతో పాటు ప్రేమపూర్వకంగా ఆహ్వానింపబడ్డాడు యయాతి. (4)
అభిష్టుతశ్చ వివిధైః దేవరాజర్షిచారణైః।
అర్చితశ్చోత్తమార్ఘ్యేణ దైవతైరభినందితః॥ 5
వివిధ దేవర్షి, రాజర్షి, చారణగణాలు ప్రస్తుతించారు. దేవతలు ఉత్తమమైన అర్ఘ్యాన్ని అందించి ఆయనను పూజించి, అభినందించారు. (5)
ప్రాప్తః స్వర్గఫలం చైవ తమువాచ పితామహః।
నిర్వృతం శాంతమనసం వచోభిస్తర్పయన్నివ॥6
ఈ విధంగా యయాతి స్వర్గఫలాన్ని పొందిన తరువాత ఆనందంగా, ప్రశాంతంగా ఉన్న ఆయనను మాటలతో సంతృప్తిపరుస్తూ బ్రహ్మ ఇలా అన్నాడు. (6)
చతుష్పాదస్త్వయా ధర్మః చితో లోక్యేన కర్మణా।
అక్షయస్తవ లోకోఽయం కీర్తిశ్చైవాక్షయా దివి॥ 7
నీవు లోకహితకరమయిన కర్మల ద్వారా నాల్గుపాదాల ధర్మాన్ని ఆచరించావు. అందువలన నీకు అక్షయమైన స్వర్గ సుఖం లభించింది. ఇచ్చట అక్షయకీర్తి కూడా లభించింది. (7)
పునస్త్వయైవ రాజర్షే సుకృతేన విఘాతితమ్।
ఆవృతం తమసా చేతఆH సర్వేషాం స్వర్గవాసినామ్॥ 8
యేన త్వాం నాభిజానంతి తతోఽజ్ఞాతోఽసి పాతితః।
ప్రీత్యైవ చాసి దౌహిత్రైః తారితస్త్వమిహాగతః॥ 9
రాజర్షీ! మరల నీవే నీ పుణ్యాన్ని నశింపజేసి కొన్నావు. ఆ సయమంలో స్వర్గవాసులందరి మనస్సులూ చీకటితో నిండిపోయాయి. అందువలన నిన్ను గుర్తించలేదు. అందువలన స్వర్గభ్రష్టుడవు కావలసివచ్చినది. అయితే నీ దౌహిత్రులు ప్రేమగా నిన్ను తరింపజేశారు. మరలా ఇక్కడకు రాగలిగావు. (8-9)
స్థానం చ ప్రతిపన్నోఽసి కర్మణా స్వేన నిర్జితమ్।
అచలం శాశ్వతం పుణ్యమ్ ఉత్తమం ధ్రువమవ్యయమ్॥ 10
ఇప్పుడు నీవు నీ దౌహిత్రుల ద్వారా పొందిన పుణ్యకర్మల ఫలితంగా నిశ్చలమూ, శాశ్వతమూ, పవిత్రమూ, ఉత్తమమూ స్థిరమూ, అవ్యయమూ అయిన స్థానాన్ని పొందావు. (10)
యయాతిరువాచ
భగవాన్ సంశయో మేఽస్తి కశ్చిత్ తం ఛేత్తుమర్హసి।
నహ్యన్యమహమర్హామి ప్రష్టుం లోకపితామహ॥ 11
యయాతి ఇలా అన్నాడు.
స్వామీ! లోకపితామహా! నాకొక సంశయమున్నది. దానిని తమరే తీర్చాలి. నేను మరొకరి దగ్గర నా సందేహాన్ని ప్రకటించలేను. (11)
బహువర్షసహస్రాంతం ప్రజాపాలనవర్ధితమ్।
అనేకక్రతుదానౌఘైః ఆర్జితం మే మహత్ ఫలమ్॥ 12
కథం తదల్పకాలేన క్షీణమ్ యేనాస్మి పాతితః।
భగవన్ వేత్థ లోకాంశ్చ శాశ్వతాన్ మమ నిర్మితాన్।
కథం ను మమ తత్సర్వం విప్రణష్టం మహాద్యుతే॥ 13
నేను కొన్ని వేల సంవత్సరాలు వివిధ క్రతువులు, దానాలూ చేసి పుణ్యఫలాన్ని సంపాదించాను. ప్రజాపాలన రూపమైన ధర్మాన్ని ఆచరించి దానిని వృద్ధి చేసికొన్నాను.
అంత పుణ్యఫలం ఇంత స్వల్పవ్యవధిలో ఎలానశించింది? నన్ను స్వర్గభ్రష్టుణ్ణి ఎలా చేయగలిగింది. స్వామీ! తేజోమూర్తీ! నా సత్కర్మల ద్వారా నేను ఏ సనాతన లోకాలను పొందినదీ నీకు తెలుసు. ఆ నా పుణ్యమంతా అంత త్వరగా ఎలా నశించింది? (12-13)
పితామహ ఉవాచ
బహువర్షసహస్రాంతం ప్రజాపాలనవర్ధితమ్।
అనేకక్రతుదానౌఘైః యత్ త్వయోపార్జితం ఫలమ్॥ 14
తదనేనైవ దోషేణ క్షీణం యేనాసి పాతితః।
అభిమానేన రాజేంద్ర ధిక్కృతః స్వర్గవాసిభిః॥ 15
రాజేంద్రా! కొన్ని వేల సంవత్సరాల్లో వివిధ క్రతువులూ, దానాలూ చేసి సంపాదించి, ప్రజాపాలన ధర్మాన్ని పాటించి వృద్ధి చేసికొన్న నీ పుణ్యఫలమంతా అభిమానరూపమైన దోషం వలన నశించింది. అందుకే భ్రష్టుడవు కావలసివచ్చింది. స్వర్గవాసులంతా నిన్ను ధిక్కరించటం జరిగింది. (14-15)
నాయం మానేన రాజర్షే న బలేన న హింసయా।
న శాఠ్యేన న మాయాభిః లోకో భవతి శాశ్వతః॥ 16
రాజర్షీ! అభిమానంతో కానీ బలంతో కానీ, హింసతో కానీ, మోసంతో కానీ, మాయలతో కానీ ఈ పుణ్యలోకంలో స్థిరత్వాన్ని పొందలేరు. (16)
నావమాన్యాస్త్వయా రాజన్ అధమోత్కృష్టమధ్యమాః।
న హి మానప్రదగ్ధానాం కశ్చిదస్తి శమః క్వచిత్॥ 17
రాజా! అధములను కానీ, ఉత్తములను కానీ, మధ్యములను కానీ ఎప్పుడూ పరాభవించకూడదు. అభిమానాగ్నిలో మండిపోతున్న వాడికి తాపశాంతికి ఉపాయంలేదు. (17)
పతనారోహణమిదం కథయిష్యంతి యే నరాః।
విషమాణ్యపి తే ప్రాప్తాః తరిష్యంతి న సంశయః॥ 18
నీవు స్వర్గభ్రష్టుడవై మరల స్వర్గలోకమునకెక్కిన ఈ కథను చెప్పుకొనినవారు కష్టాలలో పడినా బయటపడతారు. ఈ విషయంలో సంశయం లేదు. (18)
నారద ఉవాచ
ఏష దోషోఽ భిమానేన పురా ప్రాప్తో యయాతినా।
నిర్బధ్నతాతిమాత్రం చ గాలవేన మహీపతే॥ 19
నారదుడిలా అన్నాడు.
రాజా! ఈ విధంగా ఆనాడు అభిమానదోషం వలన యయాతి చిక్కుల్లో పడ్డాడు. తన పట్టుదలా, మొండితనం కారణంగా గాలవుడు కూడా కష్టపడవలసి వచ్చింది. (19)
శ్రోతవ్యం హితకామానాం సుహృదాం హితమిచ్ఛతామ్।
న కర్తవ్యో హి నిర్బంధః నిర్బంధో హి క్షయోదయః॥ 20
శ్రేయోభిలాషులయిన మిత్రులు హితాన్ని కోరుతూ చెప్పినదానిని తప్పక వినాలి. మొండిపట్టుతో ఎప్పుడూ ఉండకూడదు. అది వినాశనానికి దారి తీస్తుంది. (20)
తస్మాత్ త్వమపి గాంధారే మానం క్రోధం చ వర్జయ।
సంధత్స్వ పాండవైర్వీర సంరంభం త్యజ పార్థివ॥ 21
కాబట్టి దుర్యోధనా! అభిమానాన్నీ క్రోధాన్నీ విడిచిపెట్టు. వీరులయిన పాండవులతో సంధి చేసికో, ఆవేశాన్ని వదిలిపెట్టు. (21)
(స భవాన్ సుహృదాం పథ్యం వచో గృహ్ణాతు మానృతమ్।
సమర్థైర్విగ్రహం కృత్వా విషమస్థో భవిష్యసి॥)
నీవు నీ మిత్రుల హితవచనాలనే స్వీకరించు. అసత్యాచరణల వైపు వెళ్ళవద్దు. సమర్థులైన పాండవులతో యుద్ధంచేసి తీవ్రమయిన ఇబ్బందులు పడగలవు.
దదాతి యత్ పార్థివ యత్ కరోతి
యద్వా తపస్తప్యతి యజ్జుహోతి।
న తస్య నాశోఽస్తి న చాపకర్షః
నాన్యస్తదశ్నాతి స ఏవ కర్తా॥ 22
రాజా! దానం చేసినవాడూ, విధిని నిర్వహించినవాడూ, తపస్సు చేసినవాడూ, హోమయాగా ద్యనుష్ఠానం చేసినవాడూ నశించడు. వానికి లోటూ ఉండదు. ఆ కర్మల ఫలితాన్ని మరెవ్వరూ అనుభవించరు. కర్తయే శుభాశుభకర్మఫలితాల ననుభవిస్తాడు. (22)
ఇదం మహాఖ్యానమనుత్తమం హితం
బహుశ్రుతానాం బహురోషరాగిణామ్।
సమీక్ష్య లోకే బహుధా ప్రధారితం
త్రివర్గదృష్టిః పృథివీముపాశ్నుతే॥ 23
మహాపండితులై రాగద్వేషాలకు అతీతులైన మహాపురుషుల మహత్త్వాన్ని తెలియజేసే ఉపాఖ్యానమిది. ఇది ఉత్తమమూ, హితకరమూ కూడా. లోకంలో ఎందరో ఎన్నో రకాలుగా పరిశీలించి ధర్మ అర్థ కామాలపై దృష్టి గలవాడే ఈ భూలోక సంపద ననుభవింపగలడని నిర్ధారించారు. (23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే త్రయోవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 123 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూట ఇరువదిమూడవ అధ్యాయము. (123)
(దాక్షిణాత్య అధికపాఠము ఒక శ్లోకముతో కలుపుకొని మొత్తం 24 శ్లోకాలు)