124. నూట ఇరువది నాలుగవ అధ్యాయము
శ్రీకృష్ణుడు దుర్యోధనునకు బోధచేయుట.
ధృతరాష్ట్ర ఉవాచ
భగవన్నేవమేవైతద్ యథా వదసి నారద।
ఇచ్ఛామి చాహమప్యేవం నత్వీశో భగవన్నహమ్॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు
పూజనీయా! నారదా! నీవు చెప్పినదంతా నిజమే. నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ నావల్ల కావటం లేదు.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తతః కృష్ణమ్ అభ్యభాషత కౌరవః।
స్వర్గ్యం లోక్యంచ మామాత్థ ధర్మ్యం న్యాయ్యం చ కేశవ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు.
నారదునితో అలా పలికి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు.
కేశవా! నీవు చెప్పినదంతా ఇహలోకంలోనూ, స్వర్గలోకం లోనూ కూడా ధర్మబద్ధమైంది. న్యాయబద్ధమైనది కూడా. (2)
న త్వహం స్వవశస్తాత క్రియమాణం న మే ప్రియమ్।
(న మంస్యంతే దురాత్మానః పుత్రా మమ జనార్దన)
అంగ దుర్యోధనం కృష్ణ మందం సాస్త్రాతిగం మమ॥ 3
అనునేతుం మహాబాహో యత్స్వ పురుషోత్తమ।
నాయనా జనార్దనా! నేను నా అదుపులో లేను. జరుగుతున్నదంతా నాకు ఇష్టమైనది కాదు. దుర్మార్గులైన నా కొడుకులు నా మాటను లెక్కచేయటం లేదు.
మహాబాహూ! పురుషోత్తమా! శాస్త్రాలను అతిక్రమిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్న దుర్యోధనునికి నచ్చ చెప్పి దారిలో పెట్టే ప్రయత్నం చేయి. (3 1/2)
న శృణోతి మహాబాహో వచనం సాధుభాషితమ్। 4
గాంధార్యాశ్చ హృషీకేశ విదురస్య చ ధీమతః।
అన్యేషాం చైవ సుహృదాం భీష్మాదీనాం హితైషిణామ్॥ 5
మహాబాహూ! మంచివారి మాటలు వాడు వినడు. హృషీకేశా! గాంధారి, ధీమంతుడైన విదురుడు, శ్రేయోభిలాషులైన భీష్మాదులు, ఇతర మిత్రులూ - ఎవరు చెప్పినా వినడు. (4-5)
స త్వం పాపమతిం క్రూరం పాపచిత్తమచేతనమ్।
అనుశాధి దురాత్మానం స్వయం దుర్యోధనమ్ నృపమ్॥ 6
సుహృత్కార్యం తు సుమహత్ కృతం తే స్యాజ్జనార్దన।
జనార్దనా! దురాత్ముడయిన దుర్యోధనుని బుద్ధి పాపాసక్తమై ఉంది. పాప దృష్టితోనే ప్రవర్తిస్తున్న క్రూరుడూ, అవివేకి ఈ దుర్యోధనుడు. నీవే వాడికి నచ్చజెప్పు. నీవు సంధికి ఒప్పించగలిగితే మిత్రులకోసం నీవు చాలా గొప్ప పనిచేసినట్టే. (6 1/2)
తతోఽభ్యావృత్య వార్ష్ణేయః దుర్యోధనమమర్షణమ్॥ 7
అబ్రవీన్మధురాం వాచం సర్వధర్మార్థతత్త్వవిత్।
ఆ తరువాత ధర్మార్థ తత్త్వవేత్త అయిన శ్రీకృష్ణుడు అసహనశీలి అయిన దుర్యోధనుని వైపు తిరిగి మధురవచనాలతో ఇలా అన్నాడు. (7 1/2)
దుర్యోధన నిబోధేదం మద్వాక్యం కురుసత్తమ॥ 8
శర్మార్థం తే విశేషేణ సానుబంధస్య భారత।
కురుసత్తమా! దుర్యోధనా! నా మాట విను. భారతా! నీకూ, నీ బంధుకోటికి శుభాన్ని కలిగించాలనే ప్రత్యేకంగా చెప్పవలసివస్తోంది. (8 1/2)
మహాప్రాజ్ఞకులే జాతః సాధ్వేతత్ కర్తుమర్హసి॥ 9
శ్రుతవృత్తోపసంపన్నః సర్వైః సముదితో గుణైః।
మహాజ్ఞానులవంశంలో పుట్టినవాడవు నీవు. స్వయంగా శాస్త్రజ్ఞానమూ, సద్వ్యవహారమూ తెలిసినవాడవు. ఉత్తమ గుణాలతో కూడినవాడవు. కాబట్టి నా మాటను గౌరవించాలి. (9 1/2)
దౌష్కులేయా దురాత్మనః నృశంసా నిరపత్రపాః॥ 10
త ఏతదీదృశం కుర్యుః యథా త్వం తాత మన్యసే।
నాయనా! చెడ్డవంశంలో పుట్టిన వాళ్ళూ, దుర్మార్గులూ, క్రూరులూ, సిగ్గులేనివాళ్ళు మాత్రమే ఇటువంటి పనులు చేస్తారని నీకు తెలియనిది కాదు. (10 1/2)
ధర్మార్థయుక్త లోకేఽస్మిన్ ప్రవృత్తిర్లక్ష్యతే సతామ్॥ 11
అసతాం విపరీతా తు లక్ష్యతే భరతర్షభ।
భరతశ్రేష్ఠా! లోకంలో సజ్జనుల ప్రవర్తన ధర్మార్థాలను విడవకుండా ఉంటుంది. అసత్పురుషుల ప్రవృత్తి పూర్తిగా దానికి భిన్నంగా ఉంటుంది. (11 1/2)
విపరీతాం త్వియం వృత్తిః అసకృల్లక్ష్యతే త్వయి॥ 12
అధర్మశ్చానుబంధోఽత్ర ఘోరః ప్రానహరో మహాన్।
అనిష్టశ్చానిమిత్తశ్చ న చ శక్యశ్చ భరత॥ 13
భారతా! నీలో ఈ విపరీత ప్రవృత్తి పదే పదే కనిపిస్తోంది. నీ పట్టుదల అధర్మంతో కూడినది. నిష్కారణమినైనది. ఇది అనిష్టహేతువు. తీవ్రంగా ప్రాణనష్టాన్ని కలిగించగలది. దానిని సఫలం చేసికొనటం కూడా అసాధ్యమే. (12-13)
తమనర్థం పరిహరన్ ఆత్మశ్రేయః కరిష్యసి।
భాతౄణామథ భృత్యానాం మిత్రాణాం చ పరంతప॥ 14
పరంతపా! ఆ అనర్థాన్ని తప్పించి నీకూ, నీ సోదరులకూ, సేవకులకూ, మిత్రులకూ కూడా శ్రేయస్సును కల్గించు(14)
అధర్మ్యాదయశస్యాచ్చ కర్మణస్త్వం ప్రమోక్ష్యసే।
ప్రాజ్ఞైః శూరైర్మహోత్సాహైః ఆత్మవద్భిఆహ బహుశ్రుతైః॥ 15
సంధత్స్వ పురుషవ్యాఘ్ర పాండవైర్భరతర్షభ।
పురుషశ్రేష్ఠా! భరతర్షభా! ఈ విధంగా చేస్తే నీవు అధర్మం నుండీ, అపకీర్తి నుండీ విముక్తిని పొందుతావు. పండితులూ, శూరులూ, ఉత్సాహపరులూ, అభిమానవంతులు, అనేక శాస్త్రాల నెరిగినవారూ అయిన పాండవులతో సంధి చేసికో. (15 1/2)
తద్దితం చ ప్రియం చైవ ధృతరాష్ట్రస్య ధీమతః॥ 16
పితామహస్య ద్రోణస్య విదురస్య మహామతేః।
కృపస్య సోమదత్తస్య బాహ్లీకస్య చ ధీమతః॥ 17
అశ్వత్థామ్నో వికర్ణస్య సంజయస్య వివింశతేః।
జ్ఞాతీనాం చైవ భూయిష్ఠం మిత్రాణాం చ పరంతప॥ 18
ఇది బుద్ధిమంతుడైన ధృతరాష్ట్రునకు కూడా ఇష్టమైనదీ, హితకరమైనదీ అనిపిస్తోంది. పరంతపా! పితామహుడైన భీష్మునకూ, ద్రోణునకూ, జ్ఞాని అయిన విదురునకు, కృపునకూ, సోమదత్తునకూ, ధీమంతుడైన బాహ్లీకునకు, అశ్వత్థామకూ, వికర్ణునకూ, సంజయునకూ, వివింశతికీ, నీ కుటుంబీకులకూ, మిత్రులకూ కూడా చాలా ప్రియమైనది. (16-18)
శమే శర్మ భవేత్ తాత సర్వస్య జగతస్తథా।
హ్రీమానసి కులే జాతః శ్రుతవాననృశంసవాన్।
తిష్ఠ తాత పితుః శాస్త్రే మాతుశ్చ భరతర్షభ॥ 19
నాయనా! సంధియే సర్వజగత్తుకూ మేలు చేయగలది. నీవు సద్వంశంలో పుట్టిన వాడవు. బిడియం గలవాడవు. పండితుడవు. సాధుస్వభావుడవు. తల్లిదండ్రుల అను శాసనంలో ఉండటం మంచిది. (19)
ఏతచ్ఛ్రేయో హి మన్యంతే పితా యచ్చాస్తి భారత।
ఉత్తమాపద్గతః సర్వః పితుః స్మరతి శాసనమ్॥ 20
భారతా! తండ్రిమాటయే శ్రేయస్కరమని సజ్జనులు భవిస్తారు. పెద్ద పెద్ద చిక్కులలో పడినవారంతా తండ్రి ఉపదేశాన్నే స్మరిస్తుంటారు. (20)
రోచతే తే పితుస్తాత పాండవైః సహ సంగమః।
సామాత్యస్య కురుశ్రేష్ఠ తత్ తుభ్యం తాత రోచతామ్॥ 21
నాయనా! కురుశ్రేష్ఠా! నీ తండ్రికీ, ఆయన మమ్త్రులకు, పాండవులతో సంధి చేసికొనటమే నచ్చిన పని, నీవు కూడా దానినే ప్రియంగా భావించాలి. (21)
శ్రుత్వా యః సుహృదాం శాస్త్రం మర్త్యో న ప్రతిపద్యతే।
విపాకాంతే దహత్యేనం కింపాకమివ భక్షితమ్॥ 22
శాస్త్ర సమ్మతమైన మిత్రుల ఉపదేశాన్ని విని కూడా స్వీకరించకపోతే పరిణామకాలంలో అది విషముష్టిని తిన్నట్టు దహించివేస్తుంది. (22)
యస్తు నిఃశ్రేయసం వాక్యం మోహాన్న ప్రతిపద్యతే।
స దీర్ఘసూత్రో హీనార్థః పశ్చాత్తాపేన యుజ్యతే॥ 23
మోహానికి చిక్కి, హితవచనాలను ఆదరించని వాడు దీర్ఘ సూత్రుడు. అటువంటివాడు స్వప్రయోజనాన్ని కోలుపోయి పశ్చాత్తాపాన్ని అనుభవిస్తాడు. (23)
యస్తు నిఃశ్రేయసం శ్రుత్వా ప్రాక్ తదేవాభిపద్యతే।
ఆత్మనో మతముత్సృజ్య స లోకే సుఖమేధతే॥ 24
హితవచనాలను విని ముందుగానే తన దురాగ్రహాన్ని విడిచి హితవచనాలను ఆదరించి ప్రవర్తించినవాడు లోకంలో సుఖంగా ఉన్నతిని పొందగలడు. (24)
యోఽర్థకామస్య వచనం ప్రాతికూల్యాన్న మృష్యతే।
శృణోతి ప్రతికూలాని ద్విషతాం వశమేతి సః॥ 25
తన శ్రేయస్సును కోరే వారి మాటలను తనకు ప్రతికూలంగా ఉన్నాయని సహింపక, తనను పాడుచేసే వారి ప్రతికూలవచనాలనే విన్నవాడు శత్రువులకు చిక్కుతాడు. (25)
సతాం మతమతిక్రమ్య యోఽసతామ్ వర్తతే మతే।
శోచంతే వ్యసనే తస్య సుహృదో న చిరాదివ॥ 26
మంచివారి బాటను విడిచి చెడ్డవారి అభిప్రాయలననుసరించి ప్రవర్తించేవాడు వెంటనే బాధలకు లోనవుతాడు. అతనిని చూచి మిత్రులు బాధపడవలసివస్తుంది. (26)
ముఖ్యానమాత్యానుత్సృజ్య యోనిహీనాన్ నిషేవతే।
స ఘోరామాపదం ప్రాప్య నోత్తార మధిగచ్ఛతి॥ 27
ప్రధానులయిన అమాత్యులను కాదని హీనప్రకృతులను సేవించేవాడు ఘోరమైన ఆపదలలో చిక్కుతాడు. అటువంటివానిని ఉద్ధరించేందుకు ఎవ్వరూ రారు. (27)
యోఽసత్సేవీ వృథాచారః న శ్రోతా సుహృదాం సతామ్।
పరాన్ వృణీతే స్వాన్ ద్వేష్టి తం గౌస్త్యజతి భారత॥ 28
భారతా! చెడ్డవారిని సేవిస్తూ, వ్యర్థంగా తిరుగుతూ, మంచి మిత్రుల మాటలను వినక పరులను ఆదరిస్తూ తన వారిని ద్వేషించే వానిని భూమి పరిత్యజిస్తుంది. (28)
స త్వం విరుధ్య తైర్వీరైః అన్యేభ్యస్త్రాణమిచ్ఛసి।
అశిష్టేభ్యోఽసమర్థేభ్యః మూఢేభ్యో భరతర్షభ॥ 29
అటువంటి నీవు, భరతశ్రేష్ఠా! ఆ వీరులలో పాండవులతో శత్రుత్వం నెరపుతూ అసమర్థులూ, అశిష్టులూ, మూఢులూ అయిన ఇతరుల నుండి రక్షణను కోరుతున్నావు. (29)
కో హి శక్రసమాన్ జ్ఞాతీన్ అతిక్రమ్య మహారథాన్।
అన్యేభ్యస్త్రాణమాశంసేత్ త్వదన్యో భువి మానవః॥ 30
ఇంద్రునితో సమానులయి మహారథిలయిన తనవారిని కాదని ఇతరుల నుండి రక్షణను కోరేవాడు నీవు తప్ప మరొకడు ఈ లోకంలో ఉండడు. (30)
జన్మప్రభృతి కౌంతేయాః నిత్యం వినికృతాస్త్వయా।
స చ తే జాతు కుస్యంతి ధర్మాత్మానో హి పాండవాః॥ 31
నీవు పుట్టిననాటి నుండీ పాండవులతో వంచనాత్మకంగానే ప్రవర్తిస్తున్నావు. వారు ఎప్పుడూ నీపై కోపగించలేదు. ఆ పాండవులు ధర్మాత్ములు. (31)
మిథ్యోపచరితాస్తాత జన్మప్రభృతి బాంధవాః।
త్వయి సమ్యఙ్ మహాబాహో ప్రతిపన్నా యశస్వినః॥ 32
నాయనా! మహాబాహూ! నీవు పుట్టిననాటి నుండీ పాఢ్Mఅవులతో కపటంగా ప్రవర్తించావు. కానీ కీర్తిమంతులయిన వారు నీ యందు ఎప్పుడూ సద్భావన గలవారే. (32)
త్వయాపి ప్రతిపత్తవ్యం తథైవ భరతర్షభ।
స్వేషు బంధుషు ముఖ్యేషు మా మన్యువశమన్వగాః॥ 33
భరతశ్రేష్ఠా! నీవు కూడా నీ ముఖ్య బంధువులైన ఆ పాండవులతో ఆ విధంగానే ప్రవర్తించాలి. కోపానికి లోనుకారాదు. (33)
త్రివర్గయుక్తః ప్రాజ్ఞానామ్ ఆరంభో భారతర్షభ।
ధర్మార్థావనురుధ్యంతే త్రివర్గాసంభవే నరాః॥ 34
భారతశ్రేష్ఠా! ప్రాజ్ఞులు ధర్మ-అర్థ-కామాల కోసం ఏ పనినయినా ప్రారంభిస్తారు. అయితే మూడింటినీ సాధించటం కుదరనప్పుడు ధర్మార్థాలను అనుసరిస్తారు. (34)
పృథక్ చ వినివిష్టానాం ధర్మం ధీరోఽనురుధ్యతే।
మధ్యమోఽర్థం కలిం బాలః కామమేవానురుధ్యతే॥ 35
ప్రత్యేకంగా ధర్మార్థకామాలలో ఏ ఒక్కదానినో పాటించవలసినప్పుడు ధీరుడు ధర్మాన్ని ఎన్నుకొంటాడు. మధ్యముడు కలహ కారణమైన అర్థాన్ని ఆదరిస్తాడు. మూఢుడు అధముడు - కామాన్ని అనుసరిస్తాడు. (35)
ఇంద్రియైః ప్రాకృతో లోభాద్ ధర్మం విప్రజహాతి యః।
కామార్థావనుపాయేన లిప్సమానో వినశ్యతి॥ 36
ఇంద్రియాలకు లొంగి లోభవశుడై ధర్మాన్ని పరిత్యజించినవాడు, తగని ఉపాయాలతో అర్థకామాలను పొందగోరుతూ నశిస్తాడు. (36)
కామార్థౌ లిప్సమానస్తు ధర్మమేవాదితః చరేత్।
న హి ధర్మాదపైత్యర్థః కామో వాపి కదాచన॥ 37
కామార్థాలను పొందగోరేవాడు మొదటినుండి ధర్మాన్నే పాటించాలి. ధర్మాన్ని వదలి అర్థకామాలు ఎప్పుడూ ఉండవు. (37)
ఉపాయం ధర్మమేవాహుః త్రివర్గస్య విశాంపతే।
లిప్సమానో హి తేనాశు కక్షేఽగ్నిరివ వర్ధతే॥ 38
రాజా! త్రివర్గమైనధర్మార్థ కామప్రాప్తికి ధర్మమే ఉపాయం. కాబట్టి ద్వారా అర్థకామాలను పొందగోరువాడు ఎండుపొదలో పడిన నిప్పు వలె వెంటనే వృద్ధిపొందుతాడు. (38)
స త్వం తాతానుపాయేన లిప్ససే భరతర్షభ।
ఆధిరాజ్యం మహద్దీప్తం ప్రథితం సర్వరాజసు॥ 39
భరతర్షభా! కానీ నీవు సమస్త రాజులలో ప్రఖ్యాతి వహించి మహోజ్జ్వలంగా ప్రకాశిస్తున్న ఈ విశాలసామ్రాజ్యాన్ని అపమార్గంలో పొందాలనుకొంటున్నావు. (39)
ఆత్మానమ్ తక్షతి హ్యేషః వనం పరశునా యథా।
యః సమ్యగ్ వర్తమానేషు మిథ్యా రాజన్ ప్రవర్తతే॥ 40
రాజా! చక్కగా వ్యవహరిస్తున్న వారితో అసద్వ్యవహారం కొనసాగించేవాడు గొడ్డలితో అడవిని నరికినట్లు తనను తానే ఖండించుకొంటాడు. (40)
న తస్య హి మతిం ఛింద్యాద్ యస్య నేచ్ఛేత్పరాభవమ్।
అవిచ్ఛిన్నమతేరస్య కళ్యాణే ధీయతే మతిః।
ఆత్మవాన్ నావమన్యేత త్రిషు లోకేషు భారత॥ 41
అప్యన్యం ప్రాకృతం కించిత్ కిము తాన్ పాండవర్షభాన్।
అమర్షవశమాపన్నో న కించిద్ బుధ్యతే జనః॥ 42
మనం పరాభవింపదలచని వ్యక్తుల మనస్సును కలతపెట్టకూడదు. బుద్ధి నశించినప్పుడే మనస్సు శుభకార్యాలలో లగ్నమవుతుంది. భారతా! అభిమానవంతుడు మూడు లోకాలలోనూ పామరులనైననూ పరాభవించకూడదు. ఇక పాండవుల విషయంలో చెప్పవలసినదేమున్నది. ఈర్ష్యాసూయలకు లోనైనవాడు ఏ విషయాన్నీ గ్రహించలేడు. (41-42)
ఛిద్యతే హ్యాతతం సర్వం ప్రమాణమ్ పశ్య భారత।
శ్రేయస్తే దుర్జనాత్ తాత పాండవైః సహ సంగతమ్॥ 43
నాయనా! భారతా! చూడు! ఈర్ష్యాళువు ఎంతటి ప్రమాణాన్ని అయినా విచ్ఛిన్నం చేయాలని చూస్తాడు. నీకు దుర్మార్గులతో మైత్రి కన్న పాండవులతో చెలిమి శ్రేయస్కరం. (43)
తైర్హి సంప్రీయమాణస్త్వం సర్వాన్ కామానవాప్స్యసి।
పాండవైర్నిర్మితాం భూమిం భుంజానో రాజసత్తమ॥ 44
పాండవాన్ పృష్ఠతః కృత్వా త్రాణమాశంససేఽన్యతః।
పాండవులతో ప్రేమతో ప్రవర్తిస్తే నీ కోరికలన్నీ తీరగలవు. రాజశ్రేష్ఠా! పాండవులు స్థాపించిన రాజ్యాన్ని అనుభవిస్తూ, వారిని వెనక్కునెట్టి నీవు ఇతరుల ద్వారా రక్షణను కోరుతున్నావు. (44 1/2)
దుఃశాసనే దుర్విషహే కర్ణేచాపి ససౌబలే॥ 45
ఏతేష్వైశ్వర్యమాధాయ భూతిమిచ్ఛసి భారత।
దుశ్శాసనుడు, దుర్విషహుడు, కర్ణుడు, శకుని వీరికి అధిపత్యాన్ని అప్పగించి ఔన్నత్యాన్ని పొందాలనుకొంటున్నావు. (45 1/2)
న చైతే తవ పర్యాప్తాః జ్ఞానే ధర్మార్థయోస్తథా॥ 46
విక్రమే చాప్యపర్యాస్తాః పాండవాన్ ప్రతి భారత।
భారతా! వీరు జ్ఞాన - దర్మ - అర్థ విషయాలలో చాలినంతవారు కాదు. పాండవులను ఎదిరించగల పరాక్రమం కూడా వీరికి లేదు. (46 1/2)
న హీమే సర్వరాజానః పర్యాప్తాః సహితాస్త్వయా॥ 47
క్రుద్ధస్య భీమసేనస్య ప్రేక్షితుం ముఖమాహవే।
నీవూ, ఈ రాజులందరూ కలిసి కూడా యుద్ధభూమిలో క్రుద్ధుడైన భీమసేనుని ముఖాన్ని కూడా చూడలేరు. (47 1/2)
ఇదం సంనిహితం తాత సమగ్రం పార్థివం బలమ్॥ 48
అయం భీష్మస్తథా ద్రోణః కర్ణశ్చాయం తథా కృపః।
భూరిశ్రవాః సౌమదత్తిః అశ్వత్థామా జయద్రథః॥ 49
అశక్తాః సర్వ ఏవైతే ప్రతియోద్ధుం ధనంజయమ్।
నాయనా! నీ దగ్గరున్న ఈ సమస్త రాజబలం, ఈ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపుడు, భూరిశ్రవుడు, సౌమదత్తి, అశ్వత్థామ, జయద్రథుడు అందరూ కలిసి కూడా అర్జునుని ఎదిరింపలేరు. (48-49 1/2)
అజేయో హ్యర్జునః సంఖ్యే సర్వైరపి సురాసురైః।
మామషైరపి గంధర్వైః ఆ యుద్ధే చేత ఆధిథాః॥ 50
సమస్త దేవతలూ, రాక్షసులూ, మనుషులు, గంధర్వులూ ఎవ్వరూ కూడా అర్జునుని యుద్ధంలో గెలవలేరు. యుద్ధాన్ని గురించి మనస్సు పెట్టుకొనవలదు. (50)
దృశ్యతాం నా పుమాన్ కశ్చిత్ సమగ్రే పార్థివే బలే।
యోఽర్జునం సమరే ప్రాప్య స్వస్తిమానావ్రజేద్ గృహాన్॥ 51
సమస్తరాజుల సేనలలోనూ యుద్ధంలో అర్జునుని ఎదిరించి క్షేమంగా తిరిగి చేరగలవారెవరో చూపించు. (51)
కిం తే జనక్షయేణేహ కృతేన భరతర్షభ।
యస్మిన్ జితే జితం తత్ స్యాత్ పుమానేకః స దృశ్యతామ్॥ 52
భారతశ్రేష్ఠా! జనవినాశనం వలన నీకేమి లాభం? అర్జునుడు ఓడిపోతే పాండవపక్షం మొత్తం ఓడిపోయినట్టే. అటువంటి అర్జునుని గురించి ఆలోచించు. (52)
యః స దేవాన్ సగంధర్వాన్ సయక్షాసురపన్నగాన్।
అజయత్ ఖాండవప్రస్థే కస్తం యుధ్యేత మానవః॥ 53
అర్జునుడు ఖాండవవనంలో గంధర్వులు, యక్షులు, అసురులు, నాగులతో కూడిన దేవతల నందరినీ జయించినవాడు. ఆ అర్జునునితో యుద్ధం చేయగలవాడెవడు? (53)
తథా విరాటనగరే శ్రూయతే మహదద్భుతమ్।
ఏకస్య చ బహూనాం చ పర్యాప్తం తన్నిదర్శనమ్॥ 54
అదే విధంగా విరాటనగరంలో అనేకులతో అర్జునుడొక్కడే యుద్ధం చేసి గెలిచిన అద్భుతజేయటానికి నిదర్శనంగా అదొక్కటి చాలు. (54)
యుద్ధే తేన మహాదేవః సాక్షాత్ సంతోషితః శివః।
తమజేయమనాధృష్యం విజేతుం జిష్ణుమచ్యుతమ్।
ఆశంససీహ సమరే వీరమర్జున మూర్జితమ్॥ 55
యుద్ధంలో అర్జునుడు సాక్షాత్తూ పరమేశ్వరునే మెప్పించాడు. అటువంటి అజేయుడూ, ఎదిరింపజాలనివాడూ, జయశీలుడూ, అచ్యుతుడూ, బలశాలి అయిన అర్జునుని యుద్ధంలో గెలవాలని ఆశిస్తున్నావు. (55)
మద్ ద్వితీయం పునః పార్ధం కః ప్రార్థయితుమర్హతి।
యుద్ధే ప్రతీపమాయాంతమ్ అపి సాక్షాత్ పురందరః॥ 56
నేను సారథిపై నడపగా అర్జునుడు ఎదురుపడితే సాక్షాత్ దేవేంద్రుడే యుద్ధం చేయాలనుకోడు. మరెవ్వడు అర్జునునితో యుద్ధమ్ చేయదలుస్తాడు? (56)
బాహుభ్యాముద్వహేద్ భూమిం దహేత్ క్రుద్ధ ఇమాః ప్రజాః।
పాతయేత్ త్రిదివాద్ దేవాన్ యోఽర్జునం సమరే జయేత్॥ 57
అర్జునుని సమరంలో గెలవగలవాడు తన చేతులతో భూమిని పైకెత్తి పట్టగలగాలి. కోపంతో సమస్త ప్రజలనూ దహింపగలగాలి. దేవతలనందరినీ స్వర్గం నుండి గెంటే వేయగలగాలి. (57)
పశ్య పుత్రాంస్తథా భ్రాతౄన్ జ్ఞాతీన్ సంబంధినస్తథా।
త్వత్కృతే న వినశ్యేయుః ఇమే భరతసత్తమాః॥ 58
పుత్రులనూ, సోదరులనూ, దాయాదులనూ, బంధువులనూ అందరినీ గమనించు. నీ కోసం ఈ భారతవంశశ్రేష్ఠులంతా నశించకూడదు. (58)
అస్తు శేషం కౌరవాణాం మా పరాభూదిదం కులమ్।
కులఘ్న ఇతి నీచ్ఛేథాః నష్టకీర్తి ర్నరాధిప॥ 59
రాజా! కౌరవవంశం మిగలాలి. ఈ వంశం చిన్నపోగూడదు. కీర్తిని పోగొట్టుకొని నీవు వంశనాశకుడ వనిపించుకోవద్దు. (59)
త్వామేవ స్థాపయిష్యంతి యౌవరాజ్యే మహారథాః।
మహారాజ్యేఽపి పితరం ధృతరాష్ట్రం జనేశ్వరమ్॥ 60
మహారథులయిన ఆ పాండవులు నిన్నే యువరాజును చేస్తారు. నీ తండ్రి ధృతరాష్ట్ర నరపాలుడు మహారాజుగా ఉంటాడు. (60)
మా తాత శ్రియమాయాంతీమ్ అవమంస్థాః సముద్యతామ్।
అర్ధం ప్రదాయ పార్థ్యేభ్యః మహతీం శ్రియమాప్నుహి॥ 61
నాయనా! నీ ఇంట అడుగుపెట్ట దలచిన రాజ్యలక్ష్మిని పరాభవించవద్దు. పాండవులకు సగభాగాన్ని ఇచ్చి మిగిలిన విశాల సంపదను నీవు పొందు. (61)
పాండవైః సంశమం కృత్వా కృత్వా చ సుహృదాం వచః।
సంప్రీయమాణో మిత్రైశ్చ చిరం భద్రాణ్యవాప్స్యసి॥ 62
పాండవులతో సంధి చేసికొని, హితుల మాటలను పాటిస్తూ, మిత్రులతో ఆనందంగా గడుపుతూ చిరకాలం శుభంగా ఉండు. (62)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భగవద్వాక్యే చతుర్వింశత్యధికశతతమోఽధ్యాయః॥ 124 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున భగవద్వాక్యమను నూట ఇరువది నాలుగవ అధ్యాయము. (124)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకము కలుపుకొని మొత్తము 62 1/2 శ్లోకాలు)