196. నూట తొంబది ఆరవ అధ్యాయము

పాండవసేన యుద్ధమునకు బయలుదేరుట.

వైశంపాయన ఉవాచ
తథైవ రాజా కౌంతేయః ధర్మపుత్రో యుధిష్ఠిరః।
ధృష్టద్యుమ్నముఖాన్ వీరాన్ చోదయామాస భారత॥ 1
వైశంపాయనుడు చెప్తున్నాడు - భారతా! అదే సమయంలో కుంతీపుత్రుడు ధర్మసుతుడు అయిన యుధిష్ఠిరుడు ధృష్టద్యుమ్నుడు మొదలైన వీరులను(ప్రేరేపించాడు) కదలమని ఆదేశించాడు. (1)
చేదికాశికరూషాణాం నేతారం దృఢవిక్రమమ్।
సేనాపతిమమిత్రఘ్నం ధృష్టకేతుమథాదిశత్॥ 2
చేది, కాశి, కరూష దేశాలకు అధిపతి, దృఢపరాక్రమం కల శత్రునాశకుడు అయిన సేనాపతి ధృష్టకేతుని కూడా ఆజ్ఞాపించాడు. (2)
విరాటం ద్రుపదం చైవ యుయుధానం శిఖండినమ్।
పాంచాల్యౌ చ మహేష్వాసౌ యుధామన్యూత్తమౌజసౌ॥ 3
విరాటుడు, ద్రుపదుడు, యుయుధానుడు, శిఖండి, గొప్ప విలుకాండ్రు అయిన పాంచాల రాజకుమారులు యుధామన్యుడు, ఉత్తమౌజసుడు కూడా ఆదేశాలు పొందారు. (3)
తే శూరాశ్చిత్రవర్మాణః తప్తకుండలధారిణః।
ఆజ్యావసిక్తా జ్వలితాః ధిష్ణ్యేష్విన హుతాశనాః॥ 4
అశోభంత మహేష్వాసాః గ్రహాః ప్రజ్వలితా ఇవ।
ఆ వీరులందరూ చిత్రవిచిత్రమైన కవచాలు, బంగారు కుండలాలు ధరించి ఉన్నారు. హోమ కుండాలలో నేతితో తడిసిన అగ్నులవలె ప్రజ్వరిల్లుతున్నారు. మహాధనుర్ధారులై ఆకాశంలో వెలుగొందుతున్న గ్రహాల్లా శోభిస్తున్నారు. (4 1/2)
అథ సైన్యం యథాయోగం పూజయిత్వా నరర్షభః॥ 5
దిదేశ తాన్యనీకాని ప్రౌయాణాయ మహీపతిః।
తేషాం యుధిష్ఠిరో రాజా ససైన్యానాం మహాత్మనామ్॥ 6
వ్యాదిదేశ సనాహ్యానాం భక్ష్యభోజ్యమనుత్తమమ్।
సగజాశ్వమనుష్యాణాం యే చ శిల్పోపజీవినః॥ 7
నరులలో శ్రేష్ఠుడు, మహీపతి అయిన యుధిష్ఠిరుడు ఆ సైన్యాన్ని యోగ్యతానుసారంగా పూజించి, సేనావాహినిని ప్రయాణానికి ఆదేశించాడు. ఆ మహాత్ములకు వారి సైన్యానికి, వారి వాహనాలకి, వారితో ఉన్న గజాలకు, అశ్వాలకు, మనుష్యులకు, శిల్పకారులకు కూడా ఉత్తమోత్తమమయిన భక్ష్యభోజ్యాల కోసం ఆదేశించాడు. (5-7)
అభిమన్యుం బృహంతం చ ద్రౌపదేయాంశ్చ సర్వశః।
ధృష్టద్యుమ్నముఖావేతాన్ ప్రాహిణోత్ పాండునందనః॥ 8
పాండునందనుడు దృష్టద్యుమ్నుని ముందుంచి అభిమన్యుని బృహంతుని, ద్రౌపదీసుతులను వీరందరిని మొదట పంపాడు. (8)
భీమం చ యుయుధానం చ పాండవం చ ధనంజయమ్।
ద్వితీయం ప్రేషయామాస బలస్కంధం యుధిష్ఠిరః॥ 9
భీముని సాత్యకిని పాండవుడైన ధనంజయుని ముందుంచి సేనాసముదాయాన్ని ద్వితీయ దళంగా యుధిష్ఠిరుడు పంపాడు. (9)
భాండం సమారోపయతాం చరతాం సంప్రధావతామ్।
హృష్టానాం తత్ర యోధానాం శబ్దో దివమివాస్పృశత్॥ 10
అక్కడ సంతోషంగా యుద్ధసామగ్రిని సిద్ధం చేస్తున్న గుఱ్ఱాలను అదిలిస్తూ అటు ఇటు పరిగెడుతున్న యోధులు చేసే శబ్దం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంది. (10)
స్వయమేవ తతః పశ్చాద్ విరాటద్రుపదాన్వితః।
అథాపరైర్మహీపాలైః సహ ప్రాయాన్మహీపతిః॥ 11
ఆ వెనుక మిగిలిన ఇతర రాజులతో కలిసి, విరాటుడు ద్రుపదుడు తోడు రాగా స్వయంగా రాజు యుధిష్ఠిరుడు బయలుదేరాడు. (11)
భీమధన్వాయనీ సేనా ధృష్టద్యుమ్నేన పాలితా।
గంగేవ పూర్ణా స్తిమితా స్యందమానా వ్యదృశ్యత॥ 12
భయంకరమైన ధనుర్థారులతో కూడి, ధృష్టద్యుమ్నుని చేత రక్షింపబడుతున్న ఆ సేన గంగానదిలా నిండుగా ఒకప్పుడు స్తిమితంగా ఒకప్పుడు ప్రవహిస్తూ(కదులుతూ) కనిపిస్తోంది. (12)
తతః పునరనీకాని న్యయోజయత బుద్ధిమాన్।
మోహయన్ ధృతరాష్ట్రస్య పుత్రాణాం బుద్ధినిశ్చయమ్॥ 13
తెలివైన యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రకుమారులయొక్క బుద్ధి నిశ్చయాన్ని మోహపెడుతూ వారి మనో నిశ్చయాన్ని కలత చెందిస్తూ సేనా వాహినిని మరల సంయోజన చేశాడు. (13)
వి॥సం॥ బుద్ధినిఃస్రవమ్ - అని పాఠాంతరం. బుద్ధిలో పుట్టిన ఆలోచన అని అర్థం. (సర్వ)
ద్రౌపదేయాన్ మహేష్వాసాన్ అభిమమ్యం చ పాండవః।
నకులం సహదేవం చ సర్వాంశ్చైవ ప్రభద్రకాన్॥ 14
దశ చాశ్వసహస్రాణి ద్విసహస్రాణి దంతినామ్।
అయుతం చ పదాతీనాం రథాః పంచశతం తథా॥ 15
భీమసేనస్య దుర్ధర్షం ప్రథమం ప్రాదిశద్ బలమ్।
పాండునందనుడు అయిన యుధిష్ఠిరుడు గొప్ప ధనుర్ధారులైన ద్రౌపదీసుతులను, అభిమన్యుని, నకుల సహదేవులను, సమస్త ప్రభద్రక వీరులను, పదివేల ఆశ్వికసైన్యాన్ని, రెండు వేల గజసైన్యాన్ని, పదివేల కాల్బలాన్ని, ఐదువందల రథాలను సమీపించడానికి శక్యం కాని ప్రథమ దళంగా చేసి భీమసేనునికి అప్పగించాడు. (14 - 15 1/2)
మధ్యమే చ విరాటం చ జయత్సేనం చ పాండవ॥ 16
మహారథౌ చ పాంచాల్యౌ యుధామన్యూత్తమౌజసౌ।
వీర్యవంతౌ మహాత్మానౌ గదాకార్ముకధారిణౌ॥ 17
అన్వయాతాం తదా మధ్యే వాసుదేవధనంజయౌ।
పాండురాజు కొడుకు యుధిష్ఠిరుడు మధ్యమదళంలో విరాటుని, జయత్సేనుని, మహారథికులైన పాంచాల రాకుమారులు యుధామన్యు ఉత్తమౌజసులను ఉంచాడు. ఆ పాంచాల వీరులు పరాక్రమవంతులు, మహాత్ములు, గదా కర్ముకాలను ధరించినవారు. మధ్యలో వాసుదేవుడు అర్జునుడు వారిని అనుసరించి వెళ్తున్నారు. (16-17 1/2)
బభూవురతిసంరబ్ధాః కృతప్రహరణా నరాః॥ 18
తేషాం వింశతిసాహస్రాః హయాః శూరైరధిష్ఠితాః।
పంచ నాగసహస్రాణి రథవంశాశ్చ సర్వశః॥ 19
ఇంతకు మునుపు యుద్ధంలో పాల్గొన్న నరులు మిక్కిలి ఆవేశపూరితులయ్యారు. ఇరవై వేల గుఱ్ఱాల మీద శూరులు అధిష్ఠించి ఉన్నారు. ఐదువేల గజసైన్యం రథికులు వారి కన్నివైపుల ఉన్నారు. (18-19)
పదాతయశ్చ యే శూరాః కార్ముకాసిగదాధరాః।
సహస్రశోఽన్వయః పశ్చాత్ అగ్రతశ్చ సహస్రశః॥ 20
ధనుస్సులు, కత్తులు, గదలు ధరించిన పదాతులు వీరులు వేలకొద్దీ ముందువెనుకల నడుస్తున్నారు. (20)
యుధిష్ఠిరో యత్ర సైన్యే స్వయమేవ బలార్ణవే।
తత్ర తే పృథివీపాలాః భూయిష్ఠం పర్యవస్థితాః॥ 21
ఆ సేనా సముద్రంలో స్వయంగా యుధిష్ఠిరుడు ఉన్న చోట పృథివీపాలురు అధికసంఖ్యలో అతనిని చుట్టు ముట్టి ఉన్నారు. (21)
తత్ర నాగసహస్రాణి హయానామయుతాని చ।
తథా రథసహస్రాణి పదాతీనాం చ భారత॥ 22
భారతా! అక్కడ వేయి ఏనుగులు, పదివేల గుఱ్ఱాలు, వేయి రథాలు, పదాతి సైన్యం ఉన్నాయి. (22)
చేకితానః స్వసైన్యేన మహతా పార్థివర్షభ।
ధృష్టకేతుశ్చ చేదీనాం ప్రణేతా పార్థివో యయౌ॥ 23
రాజోత్తమా! తన గొప్ప సైన్యంతో చేకితానుడు, చేదిదేశపురాజు ధృష్టకేతుడు బయలుదేరారు. (23)
సాత్యకిశ్చ మే మహేష్వాసః పృష్ణీనాం ప్రవరో రథః।
వృతః శతసహస్రేణ రథానాం ప్రణుదన్ బలీ॥ 24
వృష్ణివంశంలో శ్రేష్ఠుడు, మహాధనుర్ధరుడు రథికుడు బలిష్ఠుడు అయిన సాత్యకి లక్షమంది సైన్యంతో చుట్టూ చేరి ఉండగా గర్జిస్తూ బయలుదేరాడు. (24)
క్షత్రదేవబ్రహ్మదేవౌ రథస్థౌ పురుషర్షభౌ।
జఘనం పాలయంతౌ చ పృష్ఠతోఽనుప్రజగ్మతుః॥ 25
పురుషశ్రేష్ఠులయిన క్షత్రదేవుడు బ్రహ్మదేవుడు రథస్థులయి సెన వెనుక భాగాన్ని రక్షిస్తూ వెనుకనే బయలుదేరారు. (25)
శకటాపణవేశాశ్చ యానం యుగ్యం చ సర్వశః।
తత్ర నాగసహస్రాణి హయానామయుతాని చ॥
ఫల్గు సర్వం కలత్రం చ యత్కించిత్ కృశదుర్బలమ్॥ 26
కోశసంచయవాహాంశ్చ కోష్ఠాగారం తథైవ చ।
గజానీకేన సంగృహ్య శనైః ప్రాయాద్ యుధిష్ఠిరః॥ 27
బళ్లు, అంగడివస్తువులు, వస్త్రభూషణాదులు, యుద్ధానికి కావలసిన వాహనాలు, మామూలు వాహనాలు అన్నిటిని, ఇంకా వేయి ఏనుగులు, పదివేల గుఱ్ఱాలను, బాలురు మొదలైన వారిని స్త్రీలను, కొద్దిగ కృశించి దుర్బలంగా ఉన్నవారిని, ధనరాసులను మోసేవారిని, ధాన్యాగారాన్ని వీటన్నిటిని సమీకరించుకొని గజసైన్యంతో యుధిష్ఠిరుడు మెల్లగా బయలుదేరాడు. (26-27)
తమన్వయాత్ సత్యధృతిః సౌచిత్తిర్యుద్ధదుర్మదః।
శ్రేణిమాన్ వసుదానశ్చ పుత్రః కాశ్యస్య వా విభుః॥ 28
రథా వింశతిసాహస్రాః యే తేషామనుయాయినః।
హయానాం దశ కోట్యశ్చ మహతా కింకిణీకినామ్॥ 29
గజా వింశతిసాహస్రాః ఈషాదంతాః ప్రహారిణః।
కులీనా భిన్నకరటాః మేఘా ఇవ విసర్పిణః॥ 30
అతనిని అనుసరించి యుద్ధదుర్మదుడయిన సుచిత్త కొడుకు సత్యధృతిః, శ్రేణిమానుడు, వసుదానుడు, సమర్థుడైన కాశీరాజు యొక్క కొడుకు బయలుదేరారు. ఇరవై వేల రథసైన్యం, గొప్ప కింకిణీనాదాలతో పదికోట్ల ఆశ్వికసైన్యం, పొడవైన దంతాలు కలిగి ప్రహరించడంలో నేర్పు కలిగిన, ఉత్తమ జాతికి చెందిన, మదజలం స్రవిస్తూ మేఘాల్లా వ్యాపించి నడుస్తున్న ఇరవైవేల గజబలం వారిని అనుసరించాయి. (28-30)
షష్ఠిర్నాగసహస్రాణి దశాన్యాని చ భారత।
యుధిష్ఠిరస్య యాన్యాసన్ యుధి సేనా మహాత్మనః॥ 31
క్షరంత ఇవ జీమూతాః ప్రభిన్నకరటాముఖాః।
రాజానమన్వయుః పశ్చాత్ చలంత ఇవ పర్వతాః॥ 32
భారతా! ఇవి కాక యుద్ధంలో మహాత్ముడైన యుధిష్ఠిరునికి ప్రత్యేకంగా డెబ్బైవేల గజసైన్యం ఉంది. అవి కురుస్తున్న మేఘాల్లా మదజలం స్రవిస్తూ ఉన్నాయి. కదలుతున్న పర్వతాల్లా రాజును వెన్నంటి వస్తున్నాయి. (31-32)
ఏవం తస్య బలం భీమం కుంతీపుత్రస్య ధీమతః।
యదాశ్రిత్యాథ యుయుధే ధార్తరాష్ట్రం సుయోధనమ్॥ 33
ఈ విధంగా ధీమంతుడయిన ఆ కుంతీపుత్రుని దగ్గర భయంకరమైన సైన్యం ఉంది. దానిని ఆసరాగా చేసుకుని ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. (33)
తతోఽన్యే శతశః పశ్చాత్ సహస్రాయుతశో నరాః।
నర్దంతః ప్రయయుస్తేషామ్ అనీకాని సహస్రశః॥ 34
వీటిని మించి వెనుక లక్షల కొద్దీ కాల్బలం, వారి సేనలూ హుంకరిస్తూ బయలుదేరాయి. (34)
తత్ర భేరీసహస్రాణి శంఖానామయుతాని చ।
న్యవాదయంత సంహృష్టాః సహస్రాయుతశో నరాః॥ 35
ఆ యుద్ధభూమిలో లక్షలమంది నరులు హర్షంతో వేలకొద్దీ భేరీలను, శంఖాలను మ్రోగించసాగారు. (35)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి పాండవసైన్యనిర్యాణే షణ్ణవత్యధికశతతమోఽధ్యాయః॥ 196 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున
పాండవసేనా ప్రస్థానమను నూట తొంబది ఆరవ అధ్యాయము. (196)
ఉద్యోగ పర్వము సమాప్తము