61. అరువది యొకటవ అధ్యాయము
అభిమన్యుపరాక్రమము - ధృష్టద్యుమ్నుడు శలపుత్రుని వధించుట.
సంజయ ఉవాచ
ద్రౌణిర్భూరిశ్రవాః శల్యః చిత్రసేనశ్చ మారిష ।
పుత్రః సాంయమనేశ్చైవ సౌభద్రం పర్యవారయన్ ॥ 1
సంజయుడిలా అన్నాడు. "ఆర్యా! అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యుడు, చిత్రసేనుడు, శలునికొడుకు అభిమన్యుని చుట్టుముట్టారు. (1)
సంసక్తమతితేజోభిః తమేకం దదృశుర్జనాః ।
పంచభిర్మనుజవ్యాఘ్రైః గజైః సింహశిశుం యథా ॥ 2
మహాతేజస్వులు, పురుషోత్తములు అయిన ఆ అయిదుగురితో ఒంటరిగా పోరాడుతున్న అభిమన్యుడు అయిదు ఏనుగులు చుట్టుముట్టిన సింహకిశోరంలా కనిపించాడు. (2)
నాతిలక్ష్యతయా కశ్చిత్ న శౌర్యే న పరాక్రమే ।
బభూవ సదృశః కార్ ష్ణే నాస్త్రే నాపి చ లాఘవే ॥ 3
లక్ష్యచ్ఛేదనలోనూ, శౌర్యంలోనూ, పరాక్రమంలోనూ, అస్త్ర ప్రదర్శనలోనూ, నైపుణ్యంలోనూ అభిమన్యునకు సాటిరాగల వాడొక్కడూ లేడు. (3)
తథా తమాత్మజం యుద్ధే విక్రమంతమరిందమమ్ ।
దృష్ట్వా పార్థ సుసంయత్తం సింహనాదమథానదత్ ॥ 4
ఆ రీతిగా అరిందముడైన తనకొడుకు యుద్ధంలో సన్నద్ధుడై విక్రమించటం చూసి, అర్జునుడు సింహనాదం చేశాడు. (4)
పీడయానం తు తత్ సైన్యం పౌత్రం తవ విశాంపతే ।
దృష్ట్వా త్వదీయా రాజేంద్ర సమంతాత్ పర్యవారయన్ ॥ 5
రాజేంద్రా! నీ మనుమడు - అభిమన్యుడు - నీసేనను పీడించటాన్ని గమనించి, నీ వారంతా అతనిని చుట్టుముట్టారు. (5)
ధ్వజినీం ధార్తరాష్ట్రాణాం దీనశత్రురదీనవత్ ।
ప్రత్యుద్యయౌ స సౌభద్రః తేజసా చ బలేన చ ॥ 6
తనలో దైన్యానికి తావివ్వకుండా శత్రువులను దీనులను చేయగల అభిమన్యుడు తేజస్సుతో, బలంతో ధార్తరాష్ట్రసేనపై దాడిచేశాడు. (6)
తస్య లాఘవమార్గస్థమ్ ఆదిత్యసదృశప్రభమ్ ।
వ్యదృశ్యత మహచ్చాపం సమరే యుధ్యతః పరైః ॥ 7
యుద్ధభూమిలో శత్రువులతో పోరాడుతున్న అభిమన్యుని మేటివిల్లు హస్తలాఘవమార్గంలో నిలిచి సూర్యప్రభతో వెలిగిపోతోంది. (7)
స ద్రౌణిమిషుణైకేన విద్ ధ్వా శల్యం చ పంచభిః ।
ధ్వజం సాంయమనేశ్చైవ సోఽష్టాభిశ్చిచ్ఛిదే తతః ॥ 8
అభిమన్యుడు అశ్వత్థామను ఒక బాణంతో, శల్యుని అయిదుబాణాలతో గాయపరచి, ఆఫై ఎనిమిది బాణాలతో శలుని ధ్వజాన్ని ముక్కలు చేశాడు. (8)
రుక్మదండాం మహాశక్తిం ప్రేషితాం సౌమదత్తినా ।
శీతేనోరగసంకాశాం పత్రిణాపజహార తామ్ ॥ 9
భూరిశ్రవుడు స్వర్ణదండంగలిగి, పాములా కనిపిస్తున్న మహాశక్తిని అభిమన్యునిపై విసిరాడు. అభిమన్యుడు పదునైన బాణంతో దాన్ని త్రిప్పికొట్టాడు. (9)
శల్యస్య చ మహావేగాన్ అస్యతః సమరే శరాన్ ।
(ధనుశ్చిచ్ఛేద భల్లేన తీవ్రవేగేన ఫాల్గునిః) ।
నివార్యార్జునదాయదః జఘాన చతురో హయాన్ ॥ 10
శల్యుడు రణభూమిలో మహావేగంతో బాణాలను ప్రయోగించసాగాడు. అప్పుడు అభిమన్యుడు తీవ్రవేగంతో భల్లంతో శల్యుని ధనుస్సును విరిచాడు. శల్యుని నిలువరించి, నాలుగు గుర్రాలను చంపివేశాడు. (10)
భూరిశ్రవాశ్చ శల్యశ్చ ద్రౌణిః సాంయమనిః శలః ।
నాభ్యవర్తంత సంరబ్ధాః కార్ ష్ణేర్బాహుబలోదయమ్ ॥ 11
భూరిశ్రవుడు, శల్యుడు, అశ్వత్థామ, సాంయమని, శలుడు ఎంతగా కోపించినా అభిమన్యుని బాహుబలవిజృంభణను ఆపలేకపోయారు. (11)
తతస్త్రిగర్తా రాజేంద్ర మద్రాశ్చ సహ కేకయైః ।
పంచవింశతిసాహస్రాః తవ పుత్రేణ చోదితాః ॥ 12
ధనుర్వేదవిదో ముఖ్యాః అజేయాః శత్రుభిర్యుధి ।
సహపుత్రం జిఘాంసంతం పరివప్రుః కిరీటినమ్ ॥ 13
రాజేంద్రా! తరువాత సుయోధనుని ప్రేరణచే త్రిగుర్తులు, మద్ర దేశీయులు, కేకయులు ఇరువది అయిదువేల మంది తనకొడుకుతో కలిసి శత్రువధను సంకల్పించిన అర్జునుని చుట్టుముట్టారు. వారంతా ప్రముఖధనుర్వేద వేత్తలు, యుద్ధంలో శత్రువులను గెలువరానివారు. (12,13)
తౌ తు తత్ర పితాపుత్రౌ పరిక్షిప్తౌ మహారథౌ ।
దదర్శ రాజన్ పాంచాల్యః సేనాపతిరరిందమ ॥ 14
స వారణరథౌఘానాం సహస్రైర్బహుభిర్వృతః ।
వాజిభిః పత్తిభిశ్చైవ వృతః శతసహస్రశః ॥ 15
ధనుర్విస్ఫార్య సంక్రుద్ధః నోదయిత్వా చ వాహినీమ్ ।
యయౌ తం మద్రకానీకం కేకయాంశ్చ పరంతప ॥ 16
రాజా! పరంతపా! మహారథులయిన ఆ తండ్రీ కొడుకులను శత్రువులు చుట్టుముట్టడాన్ని చూసి, అరిందముడు, పాండవసేనాపతి అయిన పాంచాలరాజు ధృష్టద్యుమ్నుడు వేల సంఖ్యలో ఏనుగులను, రథాలను, లక్ష గుర్రాలను, కాల్బలాన్ని చుట్టూ నిలుపుకొని, తన సేనను ముందుకు నడుపుతూ, కోపంగా ధనుష్టంకారం చేస్తూ మద్ర, కేకయసేనలపై దాడి చేశాడు. (14-16)
తేన కీర్తిమతా గుప్తమ్ అనీకం దృఢధన్వనా ।
సంరబ్ధరథనాగాశ్వం యోత్స్యమానమశోభత ॥ 17
యశస్వియై, గట్టి ధనుస్సును పట్టియున్న ఆ ధృష్టద్యుమ్నుని రక్షణలో యుద్ధానికి సన్నద్ధమైన ఆ సేన ఎంతో శోభించింది. దానిలోని రథాలు, ఏనుగులు, గుర్రాలు కూడా కోపంగా కనిపిస్తున్నాయి. (17)
సోఽర్జునప్రముఖే యాంతం పాంచాలకులవర్ధనః ।
త్రిభిః శారద్వతం బాణైః జత్రుదేశే సమార్పయత్ ॥ 18
పాంచాలకులవర్ధనుడైన ఆ ధృష్టద్యుమ్నుడు అరునుని వైపు వెళుతున్న కృపాచార్యుని మెడ ఎముకపై మూడు బాణాలతో కొట్టాడు. (18)
తతః స మద్రకాన్ హత్వా దశైవ దశభిః శరైః ।
పృష్ఠరక్షం జఘానాశు భల్లేన కృతవర్మణః ॥ 19
ఆపై మద్రసేనలోని పదిమందిని పదిబాణాలతో చంపి, ధృష్టద్యుమ్నుడు భల్లంతో కృతవర్మ పృష్ఠరక్షకుని చంపాడు. (19)
దమనం చాపి దాయాదం పౌరవస్య మహాత్మనః ।
జఘాన విమలాగ్రేణ నారాచేన పరంతపః ॥ 20
పరంతపుడైన ధృష్టద్యుమ్నుడు నిర్మలమైన అంచుగల బాణంతో మహాత్ముడైన పౌరవుని కొడుకును - దమనుని - చంపివేశాడు. (20)
తతః సాంయమనేః పుత్రః పాంచాల్యం యుద్ధదుర్మదమ్ ।
అవిధ్యత్ త్రింశతా బాణైః దశభిశ్చాస్య సారథిమ్ ॥ 21
ఆ తరువాత యుద్ధోన్మాదంతో ఉన్న ధృష్టద్యుమ్నుని శలుడు ముప్పైబాణాలతో గాయపరచి, పదిబాణాలతో సారథిని కూడా గాయపరిచాడు. (21)
సోఽతివిద్ధో మహేష్వాసః సృక్కిణీ పరిసంలిహన్ ।
భల్లేన భృశతీక్ష్ణేన నిచకర్తాస్య కార్ముకమ్ ॥ 22
ఈ రీతిగా తీవ్రంగా గాయపడిన ఆ మేటివిలుకాడు ధృష్టద్యుమ్నుడు పెదవులకొనలు నాకుతూ, బాగా పదునైన భల్లంతో శలపుత్రుని ధనుస్సును ఖండించాడు. (22)
అథైనం పంచవింశత్యా క్షిప్రమేవ సమార్పయత్ ।
అశ్వాంశ్చాస్యావధీద్ రాజన్ ఉభౌ తౌ పార్ ష్ణిసారథీ ॥ 23
రాజా! ఆ పై వెంటనే ఇరవై అయిదు బాణాలతో శలపుత్రుని గాయపరిచాడు. ఆయన గుర్రాలను, పృష్టరక్షకునీ, సారథిని కూడా చంపాడు. (23)
స హతాశ్వే రథే తిష్ఠన్ దదర్శ భరతర్షభ ।
పుత్రః సాంయమనేః పుత్రం పాంచాల్యస్య మహాత్మనః ॥ 24
భరతర్షభా! శలుని కొడుకు గుర్రాలు చనిపోయిన ఆ రథంమీదనే నిలిచి మహాత్ముడైన పాంచాలరాజు కొడుకును - ధృష్టద్యుమ్నుని చూశాడు. (24)
స ప్రగృహ్య మహాఘోరం నిస్త్రింశవరమాయసమ్ ।
పదాతిస్తూర్ణమానర్చ్ఛద్ రథస్థం పురుషర్షభః ॥ 25
పురుషశ్రేష్ఠుడైన శలకుమారుడు లోహనిర్మితమై, మహాభయంకరమైన కత్తిని చేతబట్టి, పాదచారియై, రథంపై నున్న ధృష్టద్యుమ్నుని మీదికి వెళ్ళాడు.(25)
తం మహౌఘమివాయాంతం ఖాత్ పతంతమివోరగమ్ ।
భ్రాంతావరణనిస్త్రింశం కాలోత్సృష్టమివాంతకమ్ ॥ 26
దీప్యమానమివాదిత్యం మత్తవారణవిక్రమమ్ ।
అపశ్యన్ పాండవాస్తత్ర ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ॥ 27
అప్పుడు పాండవులు ద్రుపదకుమారుడు ధృష్టద్యుమ్నుడు శలకుమారుని చూశారు. అతడు మండి పడుతున్న సూర్యునిలా, మదించిన ఏనుగులా పరాక్రమించాడు. ఎగిసివస్తున్న మహాప్రవాహంలా, ఆకాశం నుండి జారిపడుతున్న మహాసర్పంలా, కాలుడు పంపిన మృత్యువులా కనపడ్డాడు. ఒర నుండి తీసిన కత్తిని చేతబట్టి ఉన్నాడు. (26,27)
తస్య పాంచాలదాయాదః ప్రతీపమభిధావతః ।
శితనిస్త్రింశహస్తస్య శరావరణధారిణః ॥ 28
బాణవేగమతీతస్య తథాభ్యాశముపేయుషః ।
త్వరన్ సేనాపతిః క్రుద్ధః బిభేద గదయా శిరః ॥ 29
శలపుత్రుడు కవచాన్ని ధరించి, వాడియైన కత్తిని చేతబట్టి, బాణవేగాన్ని అతిక్రమిస్తూ విరోధభావంతో ధృష్టద్యుమ్నుని సమీపించాడు. అప్పుడు సేనాపతి అయిన పాంచాలరాజు కుమారుడు - ధృష్టద్యుమ్నుడు వెంటనే కోపంతో శలకుమారుని తలను గదతో బ్రద్దలు చేశాడు. (28,29)
తస్య రాజన్ సనిస్త్రింశం స లేభే పరమాం ముదమ్ ।
హతస్య పతతో హస్తాద్ వేగేన న్యపతద్ భువి ॥ 30
రాజా! శలకుమారుడు చనిపోగా మెరుస్తున్న కవచం, చేతిలోని కత్తి కూడా వేగంగా అతనితోపాటు నేలగూలాయి (30)
తం నిహత్య గదాగ్రేణ స లేభే పరమాం ముదమ్ ।
పుత్రః పాంచాలరాజస్య మహాత్మా భీమవిక్రమః ॥ 31
మహాత్ముడు, భీకర పరాక్రముడు అయిన పాంచాలరాజు కుమారుడు ధృష్టద్యుమ్నుడు గదాగ్రంతో శలకుమారుని చంపి, పరమానందాన్ని పొందాడు. (31)
తస్మిన్ హతే మహేష్వాసే రాజపుత్రే మహారథే ।
హాహాకారో మహానాసీత్ తవ సైనస్య మారిష ॥ 32
ఆర్యా! మేటివిలుకాడు, మహారథుడు అయిన శలకుమారుడు చనిపోగానే నీసేనలో హాహాకారం తీవ్రంగా చెలరేగింది. (32)
తతః సాంయమనిః క్రుద్ధః దృష్ట్వా నిహతమాత్మజమ్ ।
అభిదుద్రావ వేగేన పాంచాల్యం యుద్ధదుర్మదమ్ ॥ 33
ఆపై తనకుమారుని మరణాన్ని చూసి, శలుడు, క్రుద్ధుడై, యుద్ధదుర్మదుడైన ధృష్టద్యుమ్నునిపై వేగంగా దాడిచేశాడు. (33)
తౌ తత్ర సమరే శూరౌ సమేతౌ యుద్ధదుర్మదౌ ।
దదృశుః సర్వరాజానః కురవః పాండవాస్తథా ॥ 34
యుద్ధదుర్మదులై రణభూమిలో కలబడిన ఆ శూరుల నిద్దరినీ కౌరవులు, పాండవులు, ఇతర రాజులందరూ చూడసాగారు. (34)
తతః సాంయమనిః క్రుద్ధః పార్షతం పరవీరహా ।
ఆజఘాన త్రిభిర్బాణైః తోత్రైరివ మహాద్విపమ్ ॥ 35
ఆపై పరవీరహంత అయిన శలుడు కోపంతో అంకుశంతో మదపుటేనుగును పొడిచినట్టు మూడు బాణాలతో ధృష్టద్యుమ్నుని కొట్టాడు. (35)
తథైవ పార్షతం శూరం శల్యః సమితిశోభనః ।
ఆజఘానోరసి క్రుద్ధః తతో యుద్ధమవర్తత ॥ 36
అదేరీతిగా యుద్ధానికి అందాన్ని తెచ్చే శల్యుడు కూడా కోపంతో ధృష్టద్యుమ్నుని గుండెలపై కొట్టాడు. అప్పుడు భీకరంగా పోరు జరిగింది." (36)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి చతుర్థయుద్ధదివసే సాంయమనిపుత్రవధే ఏకషష్టితమోఽధ్యాయః ॥ 61 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున చతుర్థయుద్ధ దివసమున సాంయమని పుత్రవధ అను అరువది యొకటవ అధ్యాయము. (61)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి 36 1/2 శ్లోకాలు)