62. అరువది రెండవ అధ్యాయము

ఉభయపక్షవీరుల యుద్ధము - భీమసేనుడు గజసేనను సంహరించుట.

ధృతరాష్ట్ర ఉవాచ
దైవమేవ పరం మన్యే పౌరుషాదపి సంజయ ।
యత్ సైన్యం మమ పుత్రస్య పాండుసైన్యేన బాధ్యతే ॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. "సంజయా! నా కుమారుని సేన పాండవసేనచే బాధింపబడుతోంది అంటే పౌరుషం కన్న దైవశక్తియే మిన్న అని నాకనిపిస్తోంది. (1)
నిత్యం హి మామకాంస్తాత హతానేవ హి శంససి ।
అవ్యగ్రాంశ్చ ప్రహృష్టాంశ్చ నిత్యం శంససి పాండవాన్ ॥ 2
నాయనా! ప్రతిదినమూ నావారు చచ్చిపోయారనే చెప్తున్నావు. పాండవులు అవ్యగ్రంగా, ఆనందంగా ఉన్నారనే రోజూ చెప్తున్నావు. (2)
హీనాన్ పురుషకారేణ మామకానద్య సంజయ ।
పాతితాన్ పాత్యమానాంశ్చ హతనేవ చ శంససి ॥ 3
సంజయా! నా వారు పౌరుషాన్ని కోల్పోయి పాండవులచే పడగొట్టబడ్డారని, పడగొట్టబడుతున్నారనీ, చచ్చిపోతున్నారని ఎప్పుడూ చెప్తున్నావు. (3)
యుధ్యమానాన్ యథాశక్తి ఘటమానాన్ జయం ప్రతి ।
పాండవా హి జయంత్యేవ జీయంతే చైవ మామకాః ॥ 4
నా వారు గెలుపుకోసం యథాశక్తిగా ప్రయత్నిస్తున్నారు, పోరాడుతున్నారు. అయినా పాండవులే గెలుస్తున్నారు. నా కుమారులు ఓడిపోతున్నారు. (4)
సోఽహం తీవ్రాణి దుఃఖాని దుర్యోధనకృతాని చ ।
శ్రోష్యామి సతతం తాత దుఃసహాని బహూని చ ॥ 5
నాయనా! దుర్యోధనుని వల్ల నేను ఎప్పుడూ దుస్సహమైన తీవ్ర దుఃఖాన్ని కలిగించే వార్తలనే ఎక్కువగా వినవలసివస్తోంది. (5)
తముపాయం న పశ్యామి జీయేరన్ యేన పాండవాః ।
మామకా విజయం యుద్ధే ప్రాప్నుయుర్యేన సంజయ ॥ 6
సంజయా! యుద్ధంలో పాండవులు ఓడిపోయి, నా కుమారులు విజయాన్ని పొందే ఉపాయమేదీ కనిపించటం లేదు." (6)
క్షయం మనుష్యదేహానాం గజవాజిరథక్షయమ్ ।
శృణు రాజన్ స్థిరో భూత్వా తవైవాపనయో మహాన్ ॥ 7
సంజయుడిలా చెప్తున్నాడు. "రాజా! మనుష్యులెందరో మరణిస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు నశిస్తున్నాయి. మనస్సు దిటపు చేసికోని విను. ఇది నీవు చేసిన అన్యాయ ఫలితమే. (7)
ధృష్టద్యుమ్నస్తు శల్యేన పీడితో నవభిః శరైః ।
పీడయామాస సంక్రుద్ధః మద్రాధిపతిమాయసైః ॥ 8
శల్యుడు తొమ్మిది బాణాలతో ధృష్టద్యుమ్నుని పీడిస్తే కోపించిన అతడు లోహబాణాలతో శల్యుని పీడించాడు. (8)
తత్రాద్భుతమపశ్యామ పార్షతస్య పరాక్రమమ్ ।
న్యవారయత యస్తూర్ణం శల్యం సమితిశోభనమ్ ॥ 9
యుద్ధానికే శోభతెచ్చే శల్యుని అంతవేగంగా నివారించిన ధృష్టద్యుమ్నుని పరాక్రమం అద్భుతంగా కనిపించింది. (9)
నాంతరం దృశ్యతే తత్ర తయోశ్చ రథినోస్తదా ।
ముహూర్తమివ తద్ యుద్ధం తయోః సమమివాభవత్ ॥ 10
ఆ మహారథులిద్దరి మధ్య తేడా కనిపించటం లేదు. ముహూర్తకాలం ఇద్దరూ సమానంగానే పోరాడారు. (10)
తతః శల్యో మహారాజ ధృష్టద్యుమ్నస్య సంయుగే ।
ధనుశ్చిచ్ఛేద భల్లేన పీతేన నిశితేన చ ॥ 11
మహారాజా! ఆ తరువాత శల్యుడు పచ్చని, పదునైన భల్లంతో యుద్ధంలో ధృష్టద్యుమ్నుని ధనుస్సును ఖండించాడు. (11)
అథైనం శరవర్షేణ ఛాదయామాస సంయుగే ।
గిరిం జలాగమే యద్వత్ జలదా జలవృష్టిభిః ॥ 12
ఆపై వర్షాకాలంలో మేఘాలు జలవృష్టితో పర్వతాన్ని కప్పివేసినట్టు శల్యుడు యుద్ధంలో శరవర్షంతో ధృష్టద్యుమ్నుని కప్పివేశాడు. (12)
అభిమన్యుస్తతః క్రుద్ధః ధృష్టద్యుమ్నే చ పీడితే ।
అభిదుద్రావ వేగేన మద్రరాజరథం ప్రతి ॥ 13
ధృష్టద్యుమ్నుడు బాధింపబడటం చూసి, అభిమన్యుడు క్రుద్ధుడై, వేగంగా శల్యుని రథం వైపు దూసుకొని పోయాడు. (13)
తతో మద్రాధిపరథం కార్ ష్ణిః ప్రాప్యాతికోపనః ।
ఆర్తాయనిమమేయాత్మా వివ్యాధ నిశితైః శరైః ॥ 14
ఆపై అమేయబలుడు, అతికోపనుడు అయిన అభిమన్యుడు శల్యునిరథాన్ని సమీపించి, ఋతాయనుని కొడుకును వాడి బాణాలతో గాయపరిచాడు. (14)
తతస్తు తావకా రాజన్ పరీప్సంతోఽర్జునిం రణే ।
మద్రరాజరథం తూర్ణం పరివార్యావతస్థిరే ॥ 15
రాజా! ఆ తరువాత నీ వారు రణభూమిలో అభిమన్యుని బందీగా చేయాలని భావించి, శల్యుని రథం చుట్టూ వెంటనే నిలిచారు. (15)
దుర్యోధనో వికర్ణశ్చ దుఃశాసనవివింశతీ ।
దుర్మర్షణో దుఃసహశ్చ చిత్రసేనోఽథ దుర్ముఖః ॥ 16
సత్యవ్రతశ్చ భద్రం తే పురుమిత్రశ్చ భారత ।
ఏతే మద్రాధిపరథం పాలయంతః స్థితా రణే ॥ 17
భారతా! నీకు మేలు జరగాలి. దుర్యోధనుడు, వికర్ణుడు, దుశ్శాసనుడు, వివింశతి, దుర్మర్షణుడు, దుస్సహుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు వీరంతా శల్యునిరథాన్ని కాపాడుతూ రణభూమిలో నిలిచారు. (16,17)
తాన్ భీమసేనః సంక్రుద్ధః ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ।
ద్రౌపదేయాభిమన్యుశ్చ మాద్రీపుత్రౌ చ పాండవౌ ॥ 18
ధార్తరాష్ట్రాన్ దశ రథాన్ దశైవ ప్రత్యవారయన్ ।
నానారూపాణి శస్త్రాణి విసృజంతో విశాంపతే ॥ 19
రాజా! నీ వారైన ఈ పదిమంది మహారథులను క్రుద్ధుడైన భీమసేనుడు, ద్రుపదపుత్రుడు ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదికొడుకులు, అభిమన్యుడు, మాద్రికొడుకులు నకుల సహదేవులు - ఈ పదిమంది నిరోధించారు. వివిధ రూపాలలో నున్న శస్త్రాలను విసరసాగారు. (18,19)
అభ్యవర్తంత సంహృష్టాః పరస్పరవధైషిణః ।
తే వై సమేయుః సంగ్రామే రాజన్ దుర్మంత్రితే తవ ॥ 20
రాజా! వారంతా ఒకరినొకరు చంపాలని ఆనందంగా ఎదుర్కొంటున్నారు. రణభూమిలో వారంతా ఇలా కలిసి పోరాడటం నీ దురాలోచనల ఫలితమే (20)
తస్మిన్ దశరథే క్రుద్ధే వర్తమానే మహాభయే ।
అన్యోన్యమభినర్దంతః సంప్రహారం ప్రచక్రిరే ॥ 21
ఆ పదిమంది మహారథులు కోపించి మహాభయంకరంగా యుద్ధం చేస్తుంటే నీ సేనలోనూ, శత్రుసేనలోనూ ఉన్న ఇతరరథికులు కేవలం ప్రేక్షకులయ్యారు. (21)
శస్త్రాణ్యనేకరూపాణి విసృజంతో మహారథాః ।
అన్యోన్యమభినర్దంతః సంప్రహారం ప్రచక్రిరే ॥ 22
ఆ మహారథులు అనేక రూపాలనో నున్న శస్త్రాలను పరస్పరం ప్రయోగిస్తూ, సింహనాదాలు చేస్తూ పోరాడుతున్నారు. (22)
తే తదా జాతసంరంభాః సర్వేఽన్యోన్యం జిఘాంసవః ।
అన్యోన్యమభిమర్దంతః స్పర్థమానాః పరస్పరమ్ ॥ 23
వారంతా కోపంతో నిండియున్నారు. ఒకరినొకరు చంపాలనుకొంటున్నారు. పరస్పరం పోటీ పడుతూ, ఒకరినొకరు పిండి పండి చేయాలనుకొంటున్నారు. (23)
అన్యోన్యస్పర్ధయా రాజన్ జ్ణాతయః సంగతా మిథః ।
మహాస్త్రాణి విముంచంతః సమాపేతురమర్షిణః ॥ 24
రాజా! వారంతా జ్ణాతులు పరస్పర స్పర్ధతో కలిసి పోరాడుతున్నారు. అసహనంతో ఒకరిమీదికి మరొకరు మహాస్త్రాలను ప్రయోగిస్తూ, పరాక్రమిస్తున్నారు. (24)
దుర్యోధనస్తు సంక్రుద్ధః ధృష్టద్యుమ్నం మహారణే ।
వివ్యాధ నిశితైర్బాణైః చతుర్భిః సమరే ద్రుతమ్ ॥ 25
దుర్యోధనుడు కోపించి, మహాయుద్ధంలో నాలుగు వాడి బాణాలతో వేగంగా ధృష్టద్యుమ్నుని గాయపరిచాడు. (25)
దుర్మర్షణశ్చ వింశత్యా చిత్రసేనశ్చ పంచభిః ।
దుర్ముఖో నవభిర్బాణైః దుఃసహశ్చాపి సప్తభిః ॥ 26
వివింశతిః పంచభిశ్చ త్రిభిర్దుఃశాసనస్తథా ।
తాన్ ప్రత్యవిధ్యద్ రాజేంద్ర పార్షతః శత్రుతాపనః ॥ 27
ఏకైకం పంచవింశత్యా దర్శయన్ పాణిలాఘవమ్ ।
దుర్మర్షణుడు ఇరవైబాణాలతో, చిత్రసేనుడు అయిదు బాణాలతో, దుర్ముఖుడు తొమ్మిది బాణాలతో, దుస్సహుడు ఏడు బాణాలతో వివింశతి అయిదు బాణాలతో, దుశ్శాసనుడు మూడు బాణాలతో ధృష్టద్యుమ్నుని గాయపరిచారు. రాజేంద్రా! శత్రుతాపనుడైన ధృష్టద్యుమ్నుడు తన హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ, ఒక్కొక్కరిని ఇరవై అయిదు బాణాలతో తిరిగి గాయపరిచాడు. (26,27)
సత్యవ్రతం చ సమరే పురుమిత్రం చ భారత ॥ 28
అభిమన్యురవిధ్యత్ తు దశభిర్దశభిః శరైః ।
భారతా! రణంలో అభిమన్యుడు సత్యవ్రతుని, పురుమిత్రుని పది పది బాణాలతో గాయపరిచాడు. (28)
మాద్రీపుత్రౌ తు సమరే మాతులం మాతృనందనౌ ॥ 29
అవిధ్యేతాం శరైస్తీక్ ష్ణైః తదద్భుతమివాభవత్ ।
తల్లికి ఆనందాన్ని కల్గించే మాద్రికొడుకులు - నకుల సహదేవులు తీక్ష్ణమైన బాణాలతో మేనమామను - శల్యుని గాయపరిచారు. అది అద్భుత మనిపించింది. (29)
తతః శల్యో మహారాజ స్వస్త్రీయౌ రథినాం వరౌ ॥ 30
శరైర్బహుభిరానర్చ్ఛత్ కృతప్రతికృతైషిణౌ ।
ఛాద్యమానౌ తతస్తౌ తు మాద్రీపుత్రౌ న చేలతుః ॥ 31
తిన్న దెబ్బలకు ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకొంటున్న రథిక శ్రేష్ఠులు నకుల సహదేవులను - తన మేనల్లుళ్ళను శల్యరాజు అనేక బాణాలతో పీడించాడు. బాణాలు చుట్టుముట్టడంలో నకులసహదేవులు కదలలేకపోయారు. (30,31)
అథ దుర్యోధనం దృష్ట్వా బీమసేనో మహాబలః ।
విధిత్సుః కలహస్యాంతం గదాం జగ్రాహ పాండవః ॥ 32
ఆపై మహాబలుడైన భీమసేనుడు దుర్యోధనుని చూసి, అప్పుడే యుద్ధానికి ముగింపు పలకాలని గదను చేతబట్టాడు. (32)
తముద్యతగదం దృష్ట్వా కైలాసమివ శృంగిణమ్ ।
భీమసేనం మహాబాహుం పుత్రాస్తే ప్రాద్రవన్ భయాత్ ॥ 33
గదను చేతబట్టి పైకెత్తిన భీమసేనుడు కొండకొమ్ముతో కూడిన కైలాసగిరిలా కనిపించారు. ఆ మహాబాహువును చూసి, నీ కుమారులు భయంతో పారిపోయారు. (33)
దుర్యోధనస్తు సంక్రుద్ధః మాగధం సమచోదయత్ ।
అనీకం దశసాహస్రం కుంజరాణాం తరస్వినామ్ ॥ 34
అప్పుడు దుర్యోధనుడు క్రుద్ధుడై పదివేల ఏనుగులు గల మాగధదేశగజసేనను యుద్ధానికి ప్రేరేపించాడు. ఆ సేన చాలా వేగంగా కదలగలది. (34)
గజానీకేన సహితః తేన రాజా సుయోధనః ।
మాగధం పురతః కృత్వా భీమసేనం సమభ్యయాత్ ॥ 35
ఆ గజసేనతో పాటు మాగధుని కూడా ముందు నిలుపుకొని, దుర్యోధనుడు భీమసేనునిపై దాడిచేశాడు. (35)
ఆపతంతం చ తం దృష్ట్వా గజానీకం వృకోదరః ।
గదాపాణిరవారోహద్ రథాత్ సింహ ఇవోన్నదన్ ॥ 36
గజసేన తన మీదకు రావటం చూసి భీమసేనుడు గదను ధరించి, సింహంలా గర్జిస్తూ రథం దిగాడు. (36)
అద్రిసారమయీం గుర్వీం ప్రహృహ్య మహతీం గదామ్ ।
అభ్యధావద్ గజానీకం వ్యాదితాస్య ఇవాంతకః ॥ 37
లోహనిర్మితమై, బరువుగా ఉన్న ఆ పెద్దగదను పట్టుకొని, నోరుతెరచిన యమునిలా గజసేన వైపు పరుగుతీశాడు. (37)
స గజాన్ గదయా నిఘ్నన్ వ్యచరత్ సమరే బలీ ।
భీమసేనో మహాబాహుః సవజ్ర ఇవ వాసవః ॥ 38
బలవంతుడు, మహాబాహువు అయిన భీమసేనుడు వజ్రధారి అయిన ఇంద్రునివలె ఆ గదతో ఏనుగులను చంపుతూ, రణభూమిలో సంచరించాడు. (38)
తస్య వాదేన మహతా మనోహృదయకంపినా ।
వ్యత్యచేష్టంత సంహత్య గజా భీమస్య గర్జతః ॥ 39
మనస్సును, హృదయాన్ని కంపింపజేసేటట్లు భీమసేనుడు మహాశబ్దంతో గర్జించగానే ఏనుగులన్నీ భయంతో ఒక్కచోటకు చేరి, నిశ్చేష్టమయ్యాయి. (39)
తతస్తు ద్రౌపదీపుత్రాః సౌభద్రశ్చ మహారథః ।
నకులః సహదేవశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ॥ 40
పృష్ఠం భీమస్య రక్షంతః శరవర్షేణ వారణాన్ ।
అభ్యవర్షంత ధావంతః మేఘా ఇవ గిరీన్ యథా ॥ 41
ఆపై ద్రౌపది కొడుకులు, మహారథుడైన అభిమన్యుడు, నకులసహదేవులు, ద్రుపద సుతుడైన ధృష్టద్యుమ్నుడు భీముని వెనుక రక్షణగా నిలిచి, మేఘాలు కొండలపై కురిసినట్లు పరుగెత్తి, పరుగెత్తి శరవర్షాన్ని కురిపిస్తూ, ఏనుగులపై దాడి చేశారు. (40,41)
క్షురైః క్షురప్రైర్భల్లైశ్చ పీతైశ్చాంజలికైః శితైః ।
వ్యహరన్నుత్తమాంగాని పాండవా గజయోధినామ్ ॥ 42
పాండవులు క్షురాలు, క్షురప్రాలు, పచ్చని భల్లాలు, వాడియైన అంజలికాల(బాణ విశేషం)తో గజయోధుల తలలను నరికివేశారు. (42)
శిరోభిః ప్రపతద్బిశ్చ బాహుభిశ్చ విభూషితైః ।
అశ్మవృష్టిరివాభాతి పాణిభిశ్చ సహాంకుశైః ॥ 43
ఏనుగుల మీద నుండి తలలు, అలంకరించబడియున్న బాహువులు, అంకుశాలతో సహా చేతులు నేలగూలుతుంటే ఆకాశం నుండి వడగళ్ళవాన కురిసినట్టుంది. (43)
హృతోత్తమాంగాః స్కంధేషు గజానాం గజయోధినః ।
అదృశ్యంతాచలాగ్రేషు ద్రుమా భగ్నశిఖా ఇవ ॥ 44
తలలు కోల్పోయి కూడా ఏనుగుల స్కంధాలపై నున్న గజయోధులు పర్వతశిఖరాలపై నున్న తలలు తెగిన చెట్లవలె కనిపించారు. (44)
ధృష్టద్యుమ్నహతానన్యాన్ అపశ్యామ మహాగజాన్ ।
పతతః పాత్యమానాంశ్చ పార్షతేన మహాత్మనా ॥ 45
ధృష్టద్యుమ్నుడు చంపిన మహాగజాలు ఎన్నో కనిపిస్తున్నాయి. మహాత్ముడైన ఆ ద్రుపదసుతుని దెబ్బకు ఎన్నో ఏనుగులు పడిపోయాయి. పడిపోతున్నాయి కూడా. (45)
మాగధోఽథ మహీపాలః గజమైరావణోపమమ్ ।
ప్రేషయామాస సమరే సౌభద్రస్య రథం ప్రతి ॥ 46
అప్పుడు మగధరాజు ఐరావతం వలె నున్న ఒక ఏనుగును రణభూమిలో అభిమన్యుని రథం మీదకు త్రోలాడు. (46)
తమాపతంతం సంప్రేక్ష్య మాగధస్య మహాగజమ్ ।
జఘానైకేషుణా వీరః సౌభద్రః పరవీరహా ॥ 47
మాగధుని ప్రేరణచే ఆ మహాగజం తన మీదకు రావటాన్ని గమనించి, వీరుడు పరవీరహంత అయిన అభిమన్యుడు ఒకే బాణంతో దాన్ని చంపివేశాడు. (47)
తస్యావర్జితనాగస్య కార్ ష్ణిః పరపురంజయః ।
రాజ్ఞో రజతపుంఖేన భల్లేనాపాహరచ్ఛిరః ॥ 48
ఏనుగు మరణించినా దాన్ని ఇంకా వీడకున్న మగధరాజు తలను పరపురంజయుడైన అభిమన్యుడు వెండి రెక్కలు గల భల్లంతో అపహరించాడు. (48)
విగహ్య తద్ గజానీకం భీమసేనోఽపి పాండవః ।
వ్యచరత్ సమరే మృద్నన్ గజానింద్రో గిరీనివ ॥ 49
పాండుసుతుడైన భీమసేనుడు కూడా ఆ గజసేనలోనికి చొరబడి పర్వతాలను చూర్ణం చేసే దేవేంద్రునిలా రణభూమిలో ఏనుగులను చితకకొడుతూ సంచరించాడు. (49)
ఏకప్రహారనిహతాన్ భీమసేనేన దంతినః ।
అపశ్యామ రణే తస్మిన్ గిరేన వజ్రహతానివ ॥ 50
భీమసేనుని ఒకే దెబ్బకు మరణించిన ఏనుగులు వజ్రంతో దెబ్బతిన్న కొండల వలె రణభూమిలో కనిపిస్తున్నాయి. (50)
భగ్నదంతాన్ భగ్నకరాన్ భగ్నసక్థాంశ్చ వారణాన్ ।
భగ్నపృష్ఠత్రికానన్యాన్ నిహతాన్ పర్వతోపమాన్ ॥ 51
నదతః సీదతశ్చాన్యాన్ విముఖాన్ సమరే గతాన్ ।
విద్రుతాన్ భయసంవిగ్నాన్ తథా విశకృతోఽపరాన్ ॥ 52
కొన్ని ఏనుగుల దంతాలు విరిగిపోయాయి. కొన్నింటి తొండాలు తెగిపోయాయి. కొన్నింటికి పిక్కలు విరిగిపోయాయి. కొన్నింటికి పృష్ఠాలు తెగిపోయాయి. పర్వతాల వంటి ఏనుగులెన్నో చనిపోయాయి. కొన్ని మూల్గుతున్నాయి. కొన్ని యుద్ధవిముఖత్వంతో పారిపోతున్నాయి. కొన్ని భయంతో మలమూత్రాలు విసర్జిస్తున్నాయి. (51,52)
భీమసేనస్య మార్గేషు పతితాన్ పర్వతోపమాన్ ।
అపశ్యం నిహతాన్ నాగాన్ రాజన్ నిష్ఠీవతోఽపరాన్ ॥ 53
రాజా! భీమసేనుని మార్గంలో చచ్చి పర్వాతాల వలె కనిపిస్తున్న ఏనుగులను, నోటి నుండీ నురగలు క్రక్కుతున్న ఏనుగులను నేను చూశాను. (53)
వమంతో రుధిరం చాన్యే భిన్నకుంభా మహాగజాః ।
విహ్వలంతో గతా భూమిం శైలా ఇవ ధరాతలే ॥ 54
మరికొన్ని మహాగజాలు కుంభస్థలాలు పగిలి నెత్తురు క్రక్కుతున్నాయి. మరికొన్ని కలతపడి పర్వతాల వలె నేలపై పడి ఉన్నాయి. (54)
మేదోరుధిరదిగ్ధాంగః వసామజ్జాసముక్షితః ।
వ్యచరత్ సమరే భీమః దండపాణిరివాంతకః ॥ 55
భీమసేనుని శరీరమంతా క్రొవ్వు, నెత్తురూ అంటుకొని ఉన్నాయి. వసామజ్జలతో స్నానం చేసినట్లు ఉన్నాడు. గదను చేతబట్టి దండధారి అయిన యముని వలె రణభూమిలో సంచరించాడు. (55)
గజానాం రుధిరక్లిన్నాం గదాం బిభ్రద్ వృకోదరః ।
ఘోరః ప్రతిభయశ్చాసీత్ పినాకీవ పినాకధృక్ ॥ 56
ఏనుగుల నెత్తుటితో తడిసిన గదను పట్టుకొని భీమసేనుడు పినాకాన్ని ధరించిన పరమేశ్వరుని వలె ఘోరంగా, భయంకరంగా కనిపిస్తున్నాడు. (56)
సమ్మథ్యమానాః క్రుద్ధేనః భీమసేనేన దంతినః ।
సహసా ప్రాద్రవన్ క్లిష్టాః మృద్నంతస్తవ వాహినీమ్ ॥ 57
కోపించిన భీమసేనుని చేత బాగా మథింపబడుతున్న ఏనుగులు బాధపడుతూ నీ సేనలనే త్రొక్కివేస్తూ తొందరగా పారిపోతున్నాయి. (57)
తం హి వీరం మహేష్వాసం సౌభద్రప్రముఖా రథాః ।
పర్యరక్షంత యుధ్యంతం వజ్రాయుధమివామరాః ॥ 58
వీరుడు, మేటి విలుకాడు అయిన భీముడు యుద్ధం చేస్తుంటే అభిమన్యుడు మొదలయిన మహారథులు దేవతలు ఇంద్రుని రక్షించినట్లు చుట్టూ రక్షణగా నిలిచారు. (58)
శోణితాక్తాం గదాం బిభ్రద్ ఉక్షితాం గజశోణితైః ।
కృతాంత ఇవ రౌద్రాత్మా భీమసేనో వ్యదృశ్యత ॥ 59
ఏనుగుల నెత్తుటిలో స్నానం చేసి, తడిసియున్న గదను ధరించి భీమసేనుడు రౌద్రరూపం ధరించిన యమునివలె చూపట్టాడు. (59)
వ్యాయచ్ఛమానం గదయా దిక్షు సర్వాసు భారత ।
అపశ్యామ రణే భీమం నృత్యంతమివ శంకరమ్ ॥ 60
భారతా! గదను పట్టుకొని బీమసేనుడు రణరంగంలో అన్ని దిక్కులలో కలియ తిరుగుతుంటే తాండవం చేస్తున్న శంకరునివలె కనిపిస్తున్నాడు. (60)
యమదండోపమానం గుర్వీమ్ ఇంద్రాశనిసమస్వనామ్ ।
అపశ్యామ మహారాజ రౌద్రాం విశసనీం గదామ్ ॥ 61
మహారాజా! భీమసేనుని గద బరువైనది, భీకరమైనది, సంహారం చేయగలది. అది యమదండంలా కనిపిస్తోంది. ఇంద్రుని వజ్రాయుధం వలె చప్పుడు చేస్తోంది. (61)
విమిశ్రాం కేశమజ్జాభిః ప్రదిగ్ధాం రుధిరేణ చ ।
పినాకమివ రుద్రస్య క్రుద్ధస్యాభిఘ్నతః పశూన్ ॥ 62
నెత్తుటితో తడిసి, వెంట్రుకలు, మజ్జ అతుకుకొని ఉన్న ఆ గద కోపంతో భూతసంహారం చేస్తున్న రుద్రుని పినాకం వలె కనిపిస్తోంది. (62)
యథా పశూనాం సంఘాతం యష్ట్యా పాలః ప్రకాలయేత్ ।
తథా భీమో గజానీకం గదయా సమకాలయత్ ॥ 63
పశుపాలకుడు కర్రతో పశుసముహాన్ని అదిలించినట్లు భీముడు గదతో గజసమూహాన్ని అదిలిస్తున్నాడు. (63)
గదయా వధ్యమానాస్తే మార్గణైశ్చ సమంతతః ।
స్వాన్యనీకాని మృద్నంతః ప్రాద్రవన్ కుంజరాస్తవ ॥ 64
అన్ని వైపుల నుండి గదతో, బాణాలతో చంపబడుతున్న ఆ నీ ఏనుగులు నీ సేనలనే త్రొక్కుతూ పారిపోయాయి. (64)
మహావాత ఇవాభ్రాణి విధమిత్వా స వారణాన్ ।
అతిష్ఠత్ తుములే భీమః శ్మశాన ఇవ శూలభృత్ ॥ 65
పెనుగాలి మేఘాలను చెదరగొట్టినట్లు ఆ భీమసేనుడు రణభూమిలో ఏనుగులను నష్టపరచి, శ్మశానంలో శూలపాణివలె నిలిచాడు." (65)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణిచతుర్థదివసే భీమయుద్ధే ద్విషష్టితమోఽధ్యాయః ॥ 62 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున చతుర్థదినమున భీమయుద్ధ అరువది రెండవ అధ్యాయము. (62)