63. అరువది మూడవ అధ్యాయము

భీమసేన భీష్ముల యుద్ధము - సాత్యకి భూరిశ్రవుల సమాగమము.

సంజయ ఉవాచ
హతే తస్మిన్ గజానీకే పుత్రో దుర్యోధనస్తవ ।
భీమసేనం ఘ్నతేత్యేవం సర్వసైన్యాన్యచోదయత్ ॥ 1
సంజయుడిలా అన్నాడు. "ఆ గజసేన మరణించగా నీ కొడుకు దుర్యోధనుడు "భీమసేనుని చంపండి" అంటూ తన సేనల నన్నింటినీ రెచ్చగొట్టాడు. (1)
తతః సర్వాణ్యనీకాని తవ పుత్రస్య శాసనాత్ ।
అభ్యద్రవన్ భీమసేనం నదంతం భైరవాన్ రవాన్ ॥ 2
ఆ తరువాత నీ కుమారుని ఆదేశాన్ని అనుసరించి, సేనలన్నీ భీకరంగా గర్జిస్తున్న భీమసేనునిపై దాడిచేశాయి. (2)
తం బలౌఘమపర్యంతం దేవైరపి సుదుఃసహమ్ ।
ఆపతంతం సుదుష్పారం సముద్రమివ పర్వణి ॥ 3
అపారమైన ఆ సేన దేవతలకు కూడా దుస్సహంగా ఉంది. పున్నమినాడు ఉప్పొంగే సముద్రంలా మీదికురుకుతోంది. (3)
రథనాగాశ్వకలిలం శంఖదుందుభినాదితమ్ ।
అనంతరథపాదాతం రజసా సర్వతో వృతమ్ ॥ 4
ఆ సేనాసముద్రం రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో నిండి ఉంది. శంఖదుందుభుల నాదాలతో కోలాహలంగా ఉంది. రథాలు, కాల్బలాలకు లెక్కలేదు. అంతటా దుమ్ముతో ఆవరింపబడి ఉంది. (4)
తం భీమసేనః సమరే మహోదధిమివాపరమ్ ।
సేనాసాగరమక్షోభ్యం వేలేవ సమవారయత్ ॥ 5
మరో మహాసముద్రంలా కనిపిస్తూ, కలవర పరచటానికి వీలు కాకుండా ఉన్న ఆ సేనాసాగరాన్ని రణభూమిలో భీమసేనుడు చెలియలికట్టలా అడ్డుకొన్నాడు. (5)
తదాశ్చర్యమపశ్యామ పాండవస్య మహాత్మనః ।
భీమసేనస్య సమరే రాజన్ కర్మాతిమానుషమ్ ॥ 6
రాజా! అప్పుడు పాండుకుమారుడు, మహాత్ముడైన ఆ భీమసేనుని అమానుషకర్మ రణరంగంలో ఆశ్చర్యంగా కనిపించింది. (6)
ఉదీర్ణాన్ పార్థివాన్ సర్వాన్ సాశ్వాన్ సరథకుంజరాన్ ।
అసంభ్రమం భీమసేనః గదయా సమవారయత్ ॥ 7
గుర్రాలతో, రథాలతో, ఏనుగులతో ముందు కురుకుతున్న సమస్త రాజులను భీమసేనుడు ఏ కంగారూ లేకుండా గదతోనే నిరోధించాడు. (7)
స సంవార్య బలౌఘాంస్తాన్ గదయా రథివాం వరః ।
అతిష్ఠత్ తుములే భీమః గిరిర్మేరురివాచలః ॥ 8
రథిక శ్రేష్ఠుడైన ఆ భీముడు ఆ బలసమూహాన్నంతా గదతోనే నివారించి, ఆ భీకరయుద్ధంలో మేరుపర్వతం వలె నిశ్చలంగా నిలిచాడు. (8)
తస్మిన్ సుతుములే ఘోరే కాలే పరమదారుణే ।
భ్రాతరశ్చైవ పుత్రాశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ॥ 9
ద్రౌపదేయాఽభీమన్యుశ్చ శింఖడీ చాపరాజితః ।
న ప్రాజహన్ భీమసేనం భయే జాతే మహాబలమ్ ॥ 10
మహాభయంకరమూ, ఘోరమూ, పరమ దారుణమూ అయిన ఆ సమయంలో ఏమవుతుందో అన్న భయంతో తన సోదరులు, పుత్రులు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు, ఓటమి నెరుగని శిఖండి మహాబలుడైన భీమసేనుని విడిచి వెళ్ళలేదు. (9,10)
తతః శైక్యాయసీం గుర్వీం ప్రగృహ్య మహతీం గదామ్ ।
అధావత్ తావకాన్ యోధాన్ దండపాణిరివాంతకః ॥ 11
ఆపై భీమసేనుడు ఉక్కుతో తయారు చేసిన తన విశాలమైన, బరువైన గదను పట్టుకొని, చేత దండాన్ని బట్టిన యమునివలె పారద్రోలాడు. (11)
పోథయన్ రథవృందాని వాజివృందాని చాభిభూః ।
కర్షయన్ రథవృందాని బాహువేగేన పాండవః ॥ 12
వినిఘ్నన్ వ్యచరత్ సంఖ్యే యుగాంతే కాలవద్ విభుః ।
ప్రభావశాలి అయిన పాండుకుమారుడు భీమసేనుడు ఎదురునిలిచి రథసమూహాలను, గుర్రాల సముదాయాలను నశింపజేస్తూ, బాహువేగంతో రథబృందాలను లాగుతూ, చంపుతూ, ప్రళయ కాల యమునిలా రణరంగంలో సంచరించాడు. (12 1/2)
ఉరువేగేన సంకర్షన్ రథజాలాని పాండవః ॥ 13
బలాని సమ్మమర్దాశు నడ్ వలానీవ కుంజరః ।
భీమసేనుడు మహావేగంతో రథసమూహాలను లాగుతూ, ఏనుగు రెల్లుమొక్కలను చిందరవందర చేసినట్టు సేనలను వేగంగా మర్దించాడు. (13 1/2)
మృద్నన్ రథేభ్యో రథినః గజేభ్యో గజయోధినః ॥ 14
సాదినశ్చాశ్వపృష్ఠేభ్యః భూమౌ చాపి పదాతినః ।
గదయా వ్యధమత్ సర్వాన్ వాతో వృక్షానివౌజసా ॥ 15
భీమసేనో మహాబాహుః తవ పుత్రస్య వై బలే ।
మహాబాహువైన బీమసేనుడు రథాలమీద నుండి రథికులను, ఏనుగుల మీద నుండి గజయోధులను, గుర్రాల మీద నుండి ఆశ్వికులను, నేలపై కాల్బలాన్ని లాగి, పిండి చేస్తూ గాలి తన వేగంతో చెట్లను కూల్చినట్లు నీ సేనలోని అందరినీ గదతో నశింపజేశాడు. (14,15 1/2)
సాపి మజ్జావసామాంసైః ప్రదిగ్ధా రుధిరేణ చ ॥ 16
అదృశ్యత మహారౌద్రౌ గదా నాగాశ్వపాతనీ ।
ఏనుగులను, గుర్రాలను, పడగొట్టిన ఆ గద కూడా మజ్జ, వస, మాంసాలతో నెత్తుటితో కలిసి, మహాభయంకరంగా కనిపించింది. (16 1/2)
తత్ర తత్ర హతైశ్చాపి మనుష్యగజవాజిభిః ॥ 17
రణాంగణం సమభవత్ మృత్యోరావాససన్నిభమ్ ।
అక్కడక్కడ చచ్చిపడియున్న మనుష్యులతో, ఏనుగులతో, గుర్రాలతో ఆ రణభూమి మృత్యునివాసస్థానంలా అయింది. (17 1/2)
పినాకమివ రుద్రస్య క్రుద్ధస్యాభిఘ్నతః పశూన్ ॥ 18
యమదండోపమాముగ్రామ్ ఇంద్రాశనిసమస్వనామ్ ।
దదృశుర్భీమసేనస్య రౌద్రీం విశసనీం గదామ్ ॥ 19
శత్రుసంహారం చేస్తున్న ఆ భీమసేనుని భయంకర గద కోపంతో జంతువులను సంహరిస్తున్న రుద్రుని పినాకం వలె, యముని దండం వలె కనిపించింది. ఇంద్రుని వజ్రాయుధంలా అది నినదిస్తోంది. (18,19)
ఆవిద్ధ్యతో గదాం తస్య కౌంతేయస్య మహాత్మనః ।
బభౌ రూపం మహాఘోరం కాలస్యేవ యుగక్షయే ॥ 20
తన గదను నలువైపులా త్రిప్పుతున్న మహాత్ముడైన ఆ భీమసేనుని రూపం ప్రళయకాలంలోని యమునిరూపం వలె మహాభయంకరంగా ప్రకాశించింది. (20)
తం తథా మహతీం సేనాం ద్రావయంతం పునః పునః ।
దృష్ట్వా మృత్యుమివాయాంతం సర్వే విమనసోఽభవన్ ॥ 21
ఆ మహాసేనను మాటిమాటికి అలా పారద్రోలుతూ మృత్యువు వలె మీదికి వస్తున్న ఆ భీమసేనుని చూసి, అందరూ మనసా ఉదాసీనులయ్యారు. (21)
యతో యతః ప్రేక్షతే స్మ గదాముద్యమ్య పాండవః ।
తేన తేన స్మ దీర్యంతే సర్వసైన్యాని భారత ॥ 22
భారతా! భీమసేనుడు గదనెత్తి, ఎటుచూస్తే అటు సర్వసైన్యాలు చీలిపోయి పారిపోతున్నాయి. (22)
ప్రదారయంతం సైన్యాని బలేనామితవిక్రమమ్ ।
గ్రసమానమనీకాని వ్యాదితాస్యమివాంతకమ్ ॥ 23
తం తథా భీమకర్మాణం ప్రగృహీతమహాగదమ్ ।
దృష్ట్వా వృకోదరం భీష్మః సహసైవ సమభ్యయాత్ ॥ 24
తన బలంతో సేనలను చీల్చివేస్తున్న భీముడు నోరు తెరిచి సేనలను కబళిస్తున్న మృత్యువు వలె కనిపిస్తున్నాడు. మహాగదను ఎత్తి పట్టుకొని, అమితపరాక్రమంతో భీకరంగా పోరాడుతున్న భీమసేనుని చూసి, భీష్ముడు వెంటనే అక్కడకు చేరాడు. (24)
మహతా రథఘోషేణ రథేనాదిత్యవర్చసా ।
ఛాదయన్ శరవర్షేణ పర్జన్య ఇవ వృష్టిమాన్ ॥ 25
ఆ భీష్ముడు సూర్యతేజస్సు గల రథంపై, పెద్ద రథఘోషతో కురుస్తున్న మేఘం వలె శరవృష్టితో అందరినీ కప్పివేస్తూ వస్తున్నాడు. (25)
తమాయాంతం తథా దృష్ట్వా వ్యాత్తాననమివాంతకమ్ ।
భీష్మం భీమో మహాబాహుః ప్రత్యుదీయాదమర్షితః ॥ 26
నోరు తెరిచిన యమునివలె వస్తున్న భీష్ముని చూసి, మహాబలుడైన భీమసేనుడు కోపంతో ఎదురువెళ్ళాడు. (26)
తస్మిన్ క్షణే సాత్యకిః సత్యసంధః
శినిప్రవీరోఽభ్యపతత్ పితామహమ్ ।
నిఘ్నన్నమిత్రాన్ ధనుషా దృఢేన
సంకంపయంస్తవ పుత్రస్య సైన్యమ్ ॥ 27
ఆ క్షణంలో శిని వంశవీరుడు, సత్యసంధుడు అయిన సాత్యకి, తన మేటిధనుస్సుతో శత్రుసంహారం చేస్తూ, నీ కుమారుని సేనను కంపింపజేస్తూ భీష్ముని మీదకు వచ్చాడు. (27)
తం యాంతమశ్వై రజతప్రకాశైః
శరాన్ వపంతం నిశితాన్ సుపుంఖాన్ ।
నాశక్నువన్ ధారయితుం తదానీం
సర్వే గణా భారత యే త్వదీయాః ॥ 28
భారతా! వెండి వలె ప్రకాశిస్తున్న గుర్రాలు గల రథంపై మంచిరెక్కలు గల వాడియైన బాణాలను కురిపిస్తూ వస్తున్న సాత్యకిని ఆ స్థితిలో నీ సేనలన్నీ కలిసి కూడా నిలువరించలేకపోయాయి. (28)
అవిధ్యదేనం దశభిః పృషత్కైః
అలంబుషో రాక్షసోఽసౌ తదానీమ్ ।
శరైశ్చతుర్భిః ప్రతివిద్ధ్య తం చ
నప్తా శినేరభ్యపతత్ రథేన ॥ 29
అప్పుడు అలంబుషరాక్షుసుడు పదిబాణాలతో సాత్యకిని గాయపరిచాడు. నాలుగు బాణాలతో అలంబుషుని తిరిగి కొట్టి సాత్యకి రథంతో భీష్మునిపై దాడి చేశాడు. (29)
అన్వాగతం వృష్ణివరం నిశమ్య
తం శత్రుమధ్యే పరివర్తమానమ్ ।
ప్రద్రావయంతం కురుపుంగవాంశ్చ
పునః పునశ్చ ప్రణదంతమాజౌ ॥ 30
యోధాస్త్వదీయాః శరవర్షైరవర్షన్
మేఘా యథా భూధరమంబువేగైః ।
తథాపి తం ధారయితుం న శేకుః
మధ్యందినే సూర్యమివాతపంతమ్ ॥ 31
వృష్ణివంశశ్రేష్ఠుడైన సాత్యకి వచ్చి రణభూమిలో శత్రువుల మధ్య సంచరిస్తూ, కురుసేనలను పాలద్రోలుతూ, మాటిమాటికి చేస్తున్న సింహనాదాలను విని, నీ యోధులు మేఘాలు పర్వతంపై జలధారలను కురిపించినట్లు శరవృష్టిని కురిపించాడు. అయినా మధ్యందిన మార్తాండుని వలెనున్న ఆ సాత్యకిని నిరోధించలేకపోయారు. (30,31)
న తత్ర కశ్చిన్నవిషణ్ణ ఆసీత్
ఋతే రాజన్ సోమదత్తస్య పుత్రాత్ ।
స వై సమాదాయ ధనుర్మహాత్మా
భూరిశ్రవా భారత సౌమదత్తిః ॥ 32
దృష్ట్వా రథాన్ స్వాన్ వ్యపనీయమానాన్
ప్రత్యుద్యయౌ సాత్యకిం యోద్ధుమిచ్ఛన్ ॥ 33
భారతా! ఆ సమయంలో అక్కడ సోమదత్తుని కొడుకు భూరిశ్రవుడు తప్ప, మిగిలిన వారిలో విషాదానికి లోనుకానివాడు ఒక్కడూ లేడు. మహాత్ముడైన ఆ భూరిశ్రవుడు ధనుస్సును చేతబట్టి, తమరథాలు పారిపోవటం గమనించి యుద్ధకాంక్షతో సాత్యకికి ఎదురువెళ్ళాడు." (32,33)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి సాత్యకిభూరిశ్రవఃసమాగమే షష్టితమోఽధ్యాయః ॥ 63 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున సాత్యకిభూరిశ్రవసుల సమాగమ మను అరువది మూడవ అధ్యాయము. (63)